- తాళ్లతో కట్టేసి బహిరంగంగా వీధుల్లో తిప్పిన వైనం
- ఐదుగురు అరెస్టు
- నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసు : ఎస్‌పి
ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రరాజుపేటకు చెందిన దళిత యువకుడిని రాత్రంతా నిర్బంధించి, హింసించి, తాళ్లతో కట్టి, బహిరంగంగా వీధుల్లో తిప్పడం తీవ్ర కలకలం రేపింది.
సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు భోగాపురం పోలీసు స్టేషన్‌లో ఎస్‌పి ఎఆర్ దామోదర్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం... భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన దళిత యువకుడు ఎల్లా రాజేష్... భోగాపురంలోని బైకు మెకానిక్ వెన్ను మహేష్ వద్ద బైకు కొనుగోలు చేసేందుకు ఇటీవల వెళ్లారు. బైక్ ట్రైల్ రన్ నిమిత్తం వాహనాన్ని తీసుకొని వెళ్లారు. బైకు కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించకుండా గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్‌ను వెన్ను మహేష్, లెంకా శ్రీరామ్ పట్టుకొని మెకానిక్ షెడ్‌లో శనివారం రాత్రంతా నిర్బంధించి హింసించారు. చంపడానికి ప్రయత్నించారు. డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం వరకు రాజేష్ డబ్బులు చెల్లించకపోవడంతో మరో ముగ్గురు స్నేహితులు... బొమ్మిడి వెంకటరావు, నమ్మి గోవింద్, వెన్ను అప్పారావు సహకారంతో రాజేష్ చేతులను, మెడను తాళ్లతో కట్టేసి బహిరంగంగా వీధుల్లో తిప్పుతూ హల్ చల్ చేశారు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌పి ఎఆర్ దామోదర్ స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని విచారణకు ఆదేశించారు. విజయనగరం ఇన్‌ఛార్జి డిఎస్‌పి ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సిఐ ఎన్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌పి తెలిపారు.








కామెంట్‌లు (0)