మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాహిత్యమే జీవనయానంగా అజీజ్ ప్రయాణం

1 రోజు క్రితం

azem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ‘జీవనయానం’ నాటకావిష్కరణ సభలో ప్రముఖులు

ప్రజాశక్తి - కర్నూలు కల్చరల్ : తెలుగు సాహిత్యంలో కథ, నవల, నాటకం వంటి అన్ని ప్రక్రియల్లో విశేష కృషి చేస్తూ, సాహిత్యమే జీవనయానంగా జీవిస్తున్న అరుదైన రచయిత అజీజ్ అని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య కొనియాడారు. అజీజ్ రచించిన ‘జీవనయానం’ నాటకావిష్కరణ మహోత్సవం టిజివి కళాక్షేత్రంలో ‘సాహితీ స్రవంతి’ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జి.పుల్లయ్య మాట్లాడుతూ, సమాజానికి అత్యంత దగ్గరగా ఉండే అంశాలను అజీజ్ తన రచనల ద్వారా ప్రతిబింబిస్తున్నారని ప్రశంసించారు. గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ బుక్ పోస్ట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. రచయితలు కష్టపడి పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంపాలన్నా... పెరిగిన పోస్టల్ ఛార్జీలు భారంగా మారాయని తెలిపారు. పోస్టల్ శాఖ వెంటనే బుక్ పోస్ట్‌ను తిరిగి ప్రారంభించని పక్షంలో రచయితలంతా కలిసి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.అరుణ మాట్లాడుతూ ‘జీవనయానం నాటకం సగటు మనిషి సంఘర్షణను ప్రతిబింబిస్తుందన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ ‘ఈ నాటకం ఆధునికతను, మానవీయ విలువలను ఆవిష్కరించిందని పేర్కొన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ హృదయానికి హత్తుకునేలా పాత్రలను సృష్టించడం అజీజ్ ప్రత్యేకమన్నారు. తెలుగు కళా స్రవంతి అధ్యక్షులు ఇనాతయతుల్లా మాట్లాడుతూ 30కి పైగా రచనలు చేసిన అజీజ్ సాహితీ సేవలకుగానూ ‘జీవన సాఫల్య పురస్కారం’ అందించాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత అజీజ్ మాట్లాడుతూ, ‘జీవనయానం’ మూలం ఒక రేడియో నాటకమని, దాని విస్తృత పరిధిని పుస్తకరూపంలోకి సంక్షిప్తీకరించడం ఎంతో సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రిక కళా స్రవంతి అధ్యక్షులు పి.భాస్కర్, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నాయకులు డి.పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. సభానంతరం వక్తలను, రచయితను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్