– రైతుల ఆవేదన
ప్రజాశక్తి-జియ్యమ్మ వలస: పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గవర్మంపేట పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం, ఈదురుగాలులు కురవడంతో అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలుల ఉధృతికి అరటి చెట్లు విరిగి నేలమట్టమయ్యాయి. చేతికి అందిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దత్తి జగన్నాథం నాయుడు నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేయగా, అందులో మూడు ఎకరాల పంట పూర్తిగా నష్టపోయారు. దత్తి రామినాయుడుకు చెందిన ఆరు ఎకరాలు, దత్తి వెంకట నాయుడుకు చెందిన ఆరు ఎకరాలు, మర్రపు వెంకట్ నాయుడుకు చెందిన మూడు ఎకరాల అరటి తోటలు కూడా ఈ ఈదురుగాలులకు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలోనే ఈ నష్టం జరగడంతో రైతులు తీవ్రంగా కుంగిపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కళ్ల ముందే నేలరాలిపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)