గర్భిణి కడుపుపై*పోలీసు తన్నడంతో మృతి
ఫిరోజాబాద్: బిజెపి ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. పోలీసుల దాడిలో దళిత మహిళ అయిన నిండు గర్భిణి మృతి చెందిన ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనం కేసులో నిందితుడైన గౌరవ్ కోసం ఆదివారం రాత్రి సుమారు 11.45 గంటలకు పోలీసులు అంజలి ఇంటికి వెళ్లారు. తన భర్తను అరెస్టు చేయోద్దని ఆమె పోలీసులను వేడుకున్నా, సబ్‌ఇన్‌స్పెక్టర్ ధర్మపాల్ సింగ్ ఆమె కడుపుపై తన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమె ఆరోగ్యం విషమించడంతో షికోహాబాద్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నవజాత శిశువు ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సబ్‌ఇన్‌స్పెక్టర్లు ధర్మపాల్ సింగ్, సత్యపాల్ సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు మోహన్ సింగ్, అరవింద్ కుమార్, కానిస్టేబుళ్లు భవతోష్ కుమార్, కుల్దీప్ కుమార్‌లపై చర్యలు తీసుకున్నారు. అయితే, యోగీ సర్కార్ బాధిత కుటుంబానికి ఎటువంటి పరిహారాన్ని ప్రకటించక పోవడం గమనార్హం.







కామెంట్‌లు (0)