గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈదురు గాలులకు.. నేలకొరిగిన అరటి తోటలు

1 గంట క్రితం

ఈదురు గాలులకు.. నేలకొరిగిన అరటి తోటలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 08:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.ఆరు కోట్లు నష్టం

  • కోత దశలో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన

ప్రజాశక్తి - వేంపల్లె (కడప జిల్లా) : కడప జిల్లా వేంపల్లె మండలంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వీచిన ఈదురుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని కుప్పాలపల్లె, తాళ్లపల్లె, టి వెలమవారిపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, నందిపల్లె, కత్తులూరుతో పాటు ఆయా గ్రామాల్లో సాగు చేసిన 190 మంది రైతులకు చెందిన అరటి పంట దాదాపు 400 ఎకరాల్లో నెలకొరిగాయి. బుధవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పూర్తిగా అరటి తోటలు నేలమట్టమయ్యాయి. దీంతో రూ.ఆరు కోట్లు నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు. నందిపల్లె గ్రామానికి చెందిన కుప్పాలపల్లె ప్రాంతంలో మారం రామాంజనేయరెడ్డి, మారం శివ ప్రసాద్ రెడ్డి, బంక వేణుగోపాల్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కుప్పాలపల్లెకు చెందిన చాపటి రామిరెడ్డి, టి వెలమవారిపల్లెకు చెందిన చవ్వా రవిశంకర్ రెడ్డి, శనివారపు గోపాల్ రెడ్డి, అండ్లూరు రామాంజనేయరెడ్డితో పాటు పలువురి రైతులకు చెందిన అరటి పంట నష్టం జరిగింది. ప్రస్తుతం అరటి కాయలు కోత దశలో పంట నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల నుండి అరటి సాగుక రూ.రెండు లక్షల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు. పంట సాగు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటి పారుదల తదితర వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈదురు గాలులతో నెలమట్టమైన అరటి పంటలను ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షించి నివేదికను తయారు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి తెలిపారు. ఈదురు గాలులతో టి వెలమవారిపల్లెలో 45 మంది రైతులకు చెందిన వంద ఎకరాల్లో, తాళ్లపల్లెలో 135 మంది రైతులకు చెందిన 287.5 ఎకరాల్లో, కత్తులూరులో పది మంది రైతులకు చెందిన 12.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినిందని తెలిపారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్