పోష్ చట్టంపై అవగాహన సదస్సులో రాయపాటి శైలజ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేధింపులకు గురైన మహిళలు భయాన్ని వీడి ముందుకు వస్తే మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ భరోసానిచ్చారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో పోష్ చట్టం-2013పై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శైలజ మాట్లాడుతూ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారం కోసం రూపొందించిన పోష్ చట్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను (ఐసిసి) ఏర్పాటు చేసి, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని చెప్పారు. మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాల్లో సమానత్వ వాతావరణాన్ని కల్పించాలన్నారు. కొన్ని కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు సక్రమంగా పని చేయకపోవడం విచారకరమని, వేధింపులకు గురైన మహిళలు తమ సమస్యను ధైర్యంగా నివేదించుకునే పరిస్థితులు కార్యాలయాల్లో ఉండాలని నొక్కి చెప్పారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన షీ-బాక్స్ పోర్టల్ ద్వారా కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించవచ్చన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ అడ్వైజరీ సభ్యులు సూయజ్, డిఆర్‌ఒ అద్దెయ్య, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.నాగమల్లేశ్వరి, ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)