విచారణకు కోర్టు అనుమతి
ప్రజాశక్తి - కాకినాడ రూరల్ : పిఠాపురం పంచాయతీ రాజ్ ఎఇ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సాధిక్ ఖాన్‌ను రెండోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో, సర్పవరం పోలీసులు రెండు రోజుల పాటు సాదిక్‌ఖాన్‌ను విచారించనున్నారు. కోర్టు అనుమతి మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న సాధిక్‌ను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాకినాడ రూరల్‌లోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సర్పవరం సిఐ సిహెచ్.ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి జగదీశ్వరరెడ్డి హత్య కేసులో సాదిక్‌ఖాన్‌ను సెప్టెంబర్‌లో మూడు రోజుల పాటు విచారించి, రిమాండ్ కు పంపించారు. ఈ విచారణలో నిందితుడు పూర్తిస్థాయిలో సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకే అనుమతిచ్చింది. గతంలో సేకరించిన ఆధారాలతో నిందితుడి వాంగ్మూలాలను సరిపోల్చడంతో పాటు, కేసులో ఇంకా నిర్ధారించాల్సిన అంశాలపై పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగదీశ్వరరెడ్డి మృతికి సంబంధించి విషప్రయోగం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఫోన్ కాల్ వివరాలు, డిజిటల్ లావాదేవీలు తదితర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ ఈ ఆర్థిక వ్యవహారానికి హత్య కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)