సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, బాపట్ల, కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న విధానాలు, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కార్యక్రమాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఏజెన్సీలో డ్రోన్ సేవలు విస్తరణ
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి అభినందించారు. ఆరు నెలలుగా రెండు డ్రోన్లు విశిష్ట సేవలు అందిస్తున్నాయని, వాటి సంఖ్యను 10కి పెంచాలని సూచించారు. ఇతర ఏజెన్సీ జిల్లాల్లోనూ డ్రోన్ సేవలను విస్తరించాలని, డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అతి తక్కువ వ్యయంతోనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలైన కార్యాచరణను రూపొందించాలని అధికారులకు సూచించారు. అల్లూరి జిల్లా కలెక్టరు ప్రెజెంట్ చేసిన నమూనాను ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని ఆదేశించారు.
భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దాలి
అనంతపురం జిల్లా కలెక్టరు ఆనంద్ రూపొందించిన పాఠశాలల క్రీడా ఛాంపియన్‌షిప్ నమూనాను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలను చిన్న వయసులోనే గుర్తించి, వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమం ఉందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పాఠశాలల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతనూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, వారికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు.
స్వర్ణ భవిత నమూనా విస్తరణ
బాపట్ల జిల్లా కలెక్టరు ప్రదర్శించిన ‘స్వర్ణ భవిత’ నమూనాను మరింత మెరుగుపరిచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టరు ప్రెజెంట్ చేసిన డిజిటల్ అభ్యసన నమూనాను అధ్యయనం చేసి, ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కృత్రిమ మేధ ఆధారిత ఉపాధ్యాయుల ద్వారా పాఠాలు బోధించే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని సిఎం సూచించారు.
పిఎమ్‌డిఎస్ నమూనాతో రైతులకు ప్రయోజనం
కర్నూలు జిల్లా కలెక్టరు ప్రదర్శించిన పిఎమ్‌డిఎస్ నమూనా వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుందని సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులకు ఆదాయంతో పాటు పశుదాణా ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఈ నమూనాలో రైతుల ఆదాయం, ఉష్ణోగ్రతల తగ్గింపు, కీటకాల నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. వివిధ జిల్లాల్లో దీనిని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
తడి చెత్తతో సంపద సృష్టించాలి
ప్రకాశం జిల్లా కలెక్టరు ‘వ్యర్థాల నుంచి సంపద’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. తడి చెత్తను సమర్థంగా వినియోగించడం ద్వారా వ్యర్థాల నిర్వహణతో పాటు అదనపు ప్రయోజనాలు పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పునర్జీవం నమూనాను విస్తరించాలి
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరు చేపట్టిన ‘ప్రాజెక్టు పునర్జీవం’ పర్యావరణహితంగా ఉందని సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కార్బన్ తటస్థ నమూనాగా ఉన్న బయోచార్‌ను రైతులకు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. తక్కువ వ్యయంతో భూమిని మరింత సారవంతంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్లు రూపొందించిన వినూత్న విధానాలను అధ్యయనం చేసి, విజయవంతమైన నమూనాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త ఆలోచనలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.







కామెంట్‌లు (0)