మిలటరీ రిటైర్డ్ హవల్దారే నిందితుడు
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు వివరాలు వెల్లడించిన తెలంగాణ డిజిపి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : దేశంలోనే సంచలనం రేపిన సికింద్రాబాద్, మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ ఆయుధగారం నుంచి ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు చేధించారు. ఆర్మీ రిటైర్డ్ హవల్దారే చోరీకి పాల్పడ్డారని నిర్ధారించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ డిజిపి సివి ఆనంద్ శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో హవల్ధారుగా పనిచేసిన ఉప్పుతోళ్ళ మల్లేష్ ఈ ఏడాది జూన్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటు అనారోగ్య కారణాల వల్ల ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారాల నుంచి ఏడు పిస్టళ్లు , నాలుగు ఏకే 47, ఇన్సాస్, మందుగుండు సామాగ్రీ చోరి జరిగిందని ఆగస్టు 30న ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. జూన్ లో రిటైర్డ్ అయిన హవల్దార్ మల్లేష్ కదలికలపై దృష్టి సారించారు. కేసు తీవ్రతను ఆయన భార్యకు వివరించడంతో.. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు నిజం అంగీకరించాడు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని స్వగ్రామానికి తీసుకెళ్లి గుంతతీసి పాతిపెట్టినట్లు మల్లేష్ పోలీసులకు తెలిపారు. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి తెలిపారు.







కామెంట్‌లు (0)