ఇద్దరు కాంగ్రెస్ నేతలకు గాయాలు
ప్రజాశక్తి- ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బిజెపి శ్రేణులు దాడి చేశాయి. ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించడాన్ని నిరసిస్తూ విజయవాడలో బిజెపి శ్రేణులు బుధవారం చేపట్టిన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ పార్టీ శ్రేణులు ప్రదర్శనగా వచ్చి నగరంలోని ఆంధ్రరత్న భవన్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం)ను ముట్టడించి దాడి చేశాయి. దీంతో, కాంగ్రెస్ కార్యాలయ పరిసరాలు రణరంగంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు గాయపడ్డారు. పోలీసుల అనుమతి లేకుండానే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏలూరు రోడ్డులోని విజయ టాకీస్ సెంటరు నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. బిజెపి జెండాలు పట్టుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకొని రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. అప్పటికే ఆంధ్రరత్న భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల వారు మధ్య వాగ్వివాదం చేసుకుంటుంది. పరస్పరం దూషించుకున్నారు. కొద్దిసేపటికి పరిస్థితి అదుపు తప్పి తోపులాటకు దారితీసింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పార్టీ జెండాలు, కర్రలు, నీళ్ల బాటిళ్లు, చెప్పులు, కోడి గుడ్లు విసుకున్నారు. పిండి గుద్దులతో బాహాబాహీకి దిగారు. దీంతో, కాంగ్రెస్ కార్యాలయ ప్రాంతం రణరంగంగా మారింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్కమాల రామారావు, నాయకులు గంటా గోపీ, పీటర్ జోషఫ్ నేతృత్వంలో బిజెపి శ్రేణుల దాడిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పవన్ తేజకు స్వల్పగాయమైంది. ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, స్వల్పంగా గాయపడిన మరో కార్యకర్తను ఓ ప్రైవేటు ఆస్ప్రతికి తరలించారు. బిజెపి నేతల దాడి, దౌర్జన్యంపై కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో ఉన్న పిసిసి ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, నాయకులు మీసాల రాజేశ్వరరావు, వి.గురున్నాథం తీవ్రంగా స్పందించారు.
ఇరుపార్టీల కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కాంగ్రెస్ కార్యాలయం వైపు బిజెపి శ్రేణులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా, కొంతమంది కార్యకర్తలు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. అతి కష్టంమీద పోలీసులు వారిని నిలువరించారు. బిజెపి దాడి, దౌర్జన్యంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
కాంగ్రెస్ ప్రదర్శన... బిజెపి నేతలపై పోలీసులకు ఫిర్యాదు
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చేతులకు సంకెళ్లు వేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం నుండి ఏలూరు రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన బిజెపి నేతలపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిల
రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై బిజెపి మూకలు దాడి చేయడం పిరికిపంద చర్య అని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న శాంతియుత ఆందోళనలకు సమాధానం చెప్పలేకే బిజెపి భౌతిక దాడులకు పాల్పడిందని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతిమాలిన చర్యలు అత్యంత హేయమైనవని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా దగ్గరుండి గూండాలు, రౌడీల మాదిరిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రరత్న భవన్ వద్ద బిజెపి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బిజెపిరాష్ట్ర అధ్యక్షులు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సిపిఐ ఖండన
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బిజెపి మూకల దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీపై బిజెపి ఘర్షణకు దిగటం దుర్మార్గమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోడీ దేశ ప్రధానిగా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నారనే విషయాన్ని విస్మరించి, కేవలం బిజెపి నేతగానే బిజెపి శ్రేణులు చూడటం అవివేకమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అనాలోచిత విధానాలను ప్రశ్నించిన, విమర్శించిన వారిపై బిజెపి కుయుక్తులు పన్నుతూ దాడులు బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు.








కామెంట్‌లు (0)