ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి

6 రోజుల క్రితం

yechury
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- ఒంగోలు సిటీ : కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి విభజన రాజకీయాలను తిప్పికొట్టడమే సీతారాం ఏచూరికి అర్పించే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రజాపోరాటాల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, మార్క్సిజం లేకుండా సమానత్వాన్ని సాధించలేమని పేర్కొన్నారు. సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్థంతి సందర్భంగా ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో ఆదివారం జరిగిన ‘సంక్షోభంలో భారత్-యువత భవిష్యత్‌’ సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత ఏచూరి చిత్రపటానికి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ నల్లూరి రంగారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్‌కె మాబు అధ్యక్షత వహించిన సెమినార్‌‌తో శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ నిర్మాణంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం-లౌకికత-సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాపోరాటాల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, పేదలు, సామాన్య ప్రజలు కోరుకునే సమానత్వ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే మార్గమని స్పష్టం చేశారు. నేడు మనువాద సిద్ధాంతం పేరుతో దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దేశభక్తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌‌ను ముందుకు తెస్తూ మతపరమైన విభజనకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలు కొల్లగొడుతుంటే పాలకులు వారికి రక్షకులుగా ఉంటున్నారని విమర్శించారు. అమెరికా అనుకూల విధానాలను అమలు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని వివరించారు. ఆర్థిక సంస్కరణలు, పరిశ్రమల స్థాపన పేరుతో పంట భూములను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, వాటికి ప్రభుత్వం నుంచి రాయితీలు, పెట్టుబడులు కల్పిస్తున్నారని అన్నారు. కార్పొరేట్లు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ రుణాలు పొందుతున్నారని, అనంతరం ఎగవేతలకు పాల్పడి ప్రజాధనాన్ని నష్టపరుస్తున్నారని, దీనివల్ల సామాన్యులపై భారాలు పడుతున్నాయని వివరించారు.

పరిశ్రమల పేరుతో భూముల అప్పగింత

రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు వివరించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత రెండున్నరేళ్లలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారని తెలిపారు. పార్టీ నాయకులు జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్