- ప్రముఖ సాహితీవేత్త గుంటూరు లక్ష్మీనరసయ్య
- ఘనంగా పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి - కర్నూలు కల్చరల్ : దళిత సాహిత్యంలో నాగప్ప సుందర్రాజు ఏర్పరిచిన ఖాళీని భర్తీ చేస్తూ, వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా నిలిచిన సంచలనాత్మక కథలు 'బ్లాక్ రెయిన్ బో' అని ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసయ్య అభివర్ణించారు. కర్నూలు టిజివి కళాక్షేత్రంలో సాహితీ స్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంపి బసవరాజ్ అధ్యక్షతన జరిగిన సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ రచించిన దళిత కథల సంపుటి 'బ్లాక్ రెయిన్ బో' పుస్తకాన్ని సోమవారం లక్ష్మీనరసయ్య ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కథలు విశేషమైన వైవిధ్యతను సంతరించుకున్నాయని, రాయలసీమలో నెలకొన్న అసమానతలు, మారుతున్న సమాజంలో రూపం మార్చుకున్న వివక్షత వంటి అంశాలు ఈ కథల్లో అద్భుతంగా ఆవిష్కరించబడ్డాయని కొనియాడారు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా కథల్లో చిత్రించడం రష్యన్ కథకుడు చెకోవ్‌కే సాధ్యమైందని, ఆ శైలిని అనుసరిస్తున్న వారిలో రచయిత కెంగార మోహన్ ఒకరని ప్రశంసించారు. ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ.. రచయిత సామాజిక జీవితమే ఈ కథలకు గొప్ప వస్తువును అందించిందని, పశ్చిమ ప్రాంతపు మాండలికంలో సాగడం వల్ల ఈ కథలు కథా సాహిత్యంలో అరుదైన శిల్పంగా నిలిచాయని పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, రాయలసీమ ప్రచురణలు సంపాదకులు ఇనయతుల్లా, గౌరవ సంపాదకులు మారుతీ పౌరోహితం, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి కథలు రావడం శుభపరిణామమని, దేశ చరిత్రను మలుపు తిప్పేలా, వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ కథలు ఉన్నాయని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యక్షులు ఆకెపోగు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పార్వతయ్య, కవులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)