11వ రోజు కొనసాగిన జూడాల సమ్మె
నల్లరంగు దుస్తులు ధరించి నిరసన
ప్రజాశక్తి - యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని, స్టైఫండ్ పెంచాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చేపట్టిన ఈ సమ్మెలో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ర్యాలీ, రక్తదానం, డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో వైద్యులు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. మహిళా వైద్యులతో సహా, పెద్ద సంఖ్యలో జుడాలు రక్తదానం చేశారు. ఐఎంఎ-జెడిఎన్ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ కార్తిక్ ఆరే... సమ్మె శిబిరాన్ని సందర్శించి జుడాల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. జిడిఎ గుంటూరు అధ్యక్షులు అధ్యక్షులు డాక్టర్ దేవకుమార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్ కాంత్ మద్దతు తెలిపారు.
విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ‘మూడు శాతం వద్దు.. 30 శాతం ముద్దు, న్యాయపరమైన మా డిమాండ్లను తీర్చాలి’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఆస్పత్రి నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, సంతకాల వంతెన మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయనగరం జిల్లా జూడా అసోసియేషన్ అధ్యక్షులు రేవంత్ మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు 15 పర్సంటేజ్ స్టైఫండ్‌ను 2009 నుంచి 2025 డిసెంబర్ వరకు రెండేళ్లకోసారి పెంచుతూ వచ్చిన ప్రభుత్వాలు ఈ ఏడాది జనవరిలో పెంచవలసిన 15 శాతం స్టైఫండ్ పెంచలేదని అన్నారు.
విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు వినూత్న నిరసన చేపట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకుని, నోటిపై వేలు పెట్టుకుని మౌన నిరసన చేపట్టారు.
విజయవాడలో చెవిలో పువ్వు, నోటిపై వేలుతో నిరసన తెలుపుతున్న జూడాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో జూనియర్ వైద్యులు బైటాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను పోస్టర్ల ద్వారా ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. కడప రిమ్స్ ప్రాంగణంలో 40 మందికిపైగా హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులు రక్తదానం చేస్తూ తమ నిరసన తెలిపారు. కర్నూలులో సమ్మె శిబిరంలో 75 మంది జూనియర్ వైద్యులు రక్తదానం చేసి నిరసన తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూడాలు ఆందోళన కొనసాగించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మద్దతు తెలిపి మాట్లాడారు. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పాల్గొన్నారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రక్తదాన శిబిరం నిర్వహించి నిరసన తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ వైద్యులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.







కామెంట్‌లు (0)