ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీ చైర్మన్‌ ఎన్నికకు బ్రేక్ !

16 గంటల క్రితం

vijaya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వారం రోజులు వాయిదా

- వేచిచూసే ధోరణిలో ప్రభుత్వం

- తాత్కాలిక చైర్‌పర్సన్‌గా వాణిశ్రీ

ప్రజాశక్తి - విజయవాడ సిటీ, *ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ప్రతినిధి : విజయ డెయిరీ చైర్మన్‌ పదవి ఇప్పుడు ‌టిడిపిలో కొత్త చర్చకు దారితీస్తోంది. చైర్మన్‌ పదవిని తమ వారికి ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తుండడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొంది. చైర్మన్‌‌గా ఎన్నికైన చలసాని ఆంజనేయులును రాజీనామా చేయించడంతో విజయ డెయిరీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కొత్త రచ్చ మొదలైంది. చైర్మన్‌ పదవి కోసం పలువురు పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ పదవిని పాలడుగు నానికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌... అర్జా నగేష్ పేరును సూచించినట్లు తెలిసింది. మరోవైపు డైరెక్టర్‌గా ఉన్న చక్రవర్తికి ఇవ్వాలని ఒక ఎమ్మెల్యే, మహిళా డైరెక్టర్‌కు అవకాశం కల్పించాలని ఇంకో ఎమ్మెల్యే సూచించారట. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ అభ్యర్థి ఎంపికను వారం రోజులపాటు వాయిదా వేయాలని టిడిపి అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి విభేదాలు, వివాదాలు లేకుండా ఎంపిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని మంత్రి కొల్లు రవీంద్రకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో.. అందరినీ సమన్వయం చేసి ఏకాభిప్రాయం తీసుకురావడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చలసాని ఆంజనేయులు ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన హైదరాబాద్‌‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. బోర్డు డైరెక్టర్‌గా ఉన్న వాణిశ్రీకి తాత్కాలిక చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించారు.

ప్రభుత్వం, పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా : చలసాని ఆంజనేయులు

ప్రస్తుతం విజయ డెయిరీ చైర్మన్‌ ‌పదవి వేరొకరికి ఇవ్వడానికే సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేశాను. సమాచార లోపంతోనే ఈ ఇబ్బంది వచ్చింది. నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను, పార్టీతోనే నేను ఉంటాను. నా కుటుంబానికి ఎటువంటి బెదిరింపులు రాలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్