గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపులివెందుల డిఎస్‌‌పిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి

39 నిమిషాల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 09:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • హైకోర్టులో వైసిపి పిటిషన్

  • విచారణ నేటి వాయిదా

ప్రజాశక్తి – అమరావతి : పులివెందుల డిఎస్‌‌పి మురళీనాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైసిపి ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్‌లో తెలిపారు. డిఎస్‌‌పి కొనసాగితే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదన్నారు. డిఎస్‌‌పి మురళి నాయక్ ను బదిలీ చేయాలని కోరుతూ ఆధారాలు, పత్రాలతో ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. దీనిపై విచారణ జరిపిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ గురువారం ఆదేశాలను జారీ చేశారు .

అవినాష్‌రెడ్డి తరఫున న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. డిఎస్‌‌పి మురళీనాయక్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడుల్లో గాయపడిన ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తూ, దాడులకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వదిలేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లోనూ అభ్యర్థులు స్వేచ్ఛగా పాల్గొనకుండా అడ్డుకున్నారని, 2025 ఆగస్టు 12న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ పక్షపాత ధోరణితో వ్యవహరించారని పేర్కొన్నారు. అప్పట్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన 300 నుంచి 400 మంది మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకున్నారని, ఇదంతా డిఎస్‌‌పి మద్దతుతోనే జరిగిందని ఆరోపించారు. ఈ నెల 17న వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతుండగా పోలీసులు వారిని నామినేషన్‌ కేంద్రానికి 90 నుంచి 100 మీటర్ల దూరంలో అడ్డుకున్నారని, అభ్యర్థులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా లాఠీచార్జి చేసి, గాల్లోకి కాల్పులు జరిపారని వివరించారు. ఈ ఘటనలో వైసిపికి చెందిన పలువురు గాయపడ్డారని తెలిపారు. పులివెందుల అప్‌గ్రేడెడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో డిఎస్‌‌పి ఎనిమిది రౌండ్లు, సిఐ పది రౌండ్లు, తొండూరు ఎస్‌ఐ ఎనిమిది రౌండ్లు, ఇతర సిబ్బంది కాల్పులు జరిపినట్లు ఉందన్నారు. స్టన్‌ షెల్స్‌, స్మోక్‌ షెల్స్‌, గ్యాస్‌ గన్స్‌, హ్యాండ్‌ గ్రెనేడ్లు ఉపయోగించినట్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదైందని తెలిపారు. ఈ కేసులో 62 మంది పేర్లతోపాటు మరో 500 మంది గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేర్చారని, ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసేందుకే ఇంతమందిని నిందితులుగా చేర్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అజయ్‌కుమార్‌ పూర్తి వివరాలు సేకరించేందుకు సమయం కావాలని కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్