గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition1,450 విద్యుత్ బస్సుల టెండర్లను రద్దు చేయండి

1 గంట క్రితం

1,450 విద్యుత్ బస్సుల టెండర్లను రద్దు చేయండి
-ఆర్‌టిసి జెఎసి డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆర్‌టిసి జెఎసి డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌‌టిసి)లో రెండో దశలో ప్రవేశపెట్టనున్న 1,450 ఎసి విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లను తక్షణమే రద్దు చేయాలని ఎపిపిటిడి (ఆర్‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. గురువారం విజయవాడలోని ఆర్‌‌టిసి హౌస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కెఎస్ బ్రహ్మానందరెడ్డికి జెఎసి కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈనెల 13న యాజమాన్యం జారీ చేసిన నోటీసు ప్రకారం 29 డిపోల్లో 'గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్' (జిసిసి) విధానంలో ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బస్సుల ప్రవేశానికి తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఆర్‌‌టిసి స్వయంగా కొనుగోలు చేసి సొంత ఉద్యోగులతో నడపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంస్థకు సొంత డిపోలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వల్ల ఆర్‌ ‌టిసి ఆదాయం, ఉద్యోగ భద్రత దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘స్త్రీశక్తి’ పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని, సంస్థలోని 15,000 ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు. గతంలో మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు2, నెల్లూరు2, మంగళం డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.టెండర్ల రద్దును కోరుతూ ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలపాలని జెఎసి పిలుపునిచ్చింది. 26న విజయవాడలో జెఎసి సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం, ఆర్‌‌టిసి యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలు జరపకపోతే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు పివి రమణారెడ్డి, జివి నరసయ్య, సిహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్‌ ‌వి శేషగిరిరావు, వైఎస్.రావు, కె సూర్యప్రకాశరావు, డి మాలాద్రి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్