గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ స్వేచ్ఛగా జరగాలి : సిపిఎం

1 గంట క్రితం

CPI(M) State Committee strongly condemns illegal arrests of Gannavaram Airport residents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నిర్బంధంతో ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కడం చట్ట విరుద్దం

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ​అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వెళుతున్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డులో పోలీసులు అడ్డుకొని అరెస్టుచేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే వారిని విడుదల చేసి ప్రజాభిప్రాయసేకరణలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తెల్లవారు జాము నుంచి సిపిఎం ఎస్.రాయవరం మండల కార్యదర్శి ఎం. సత్యనారాయణ, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం.రాజేష్, రాజయ్యపేట సిపిఎం శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబులను గృహ నిర్బంధించడం అప్రజాస్వామికమని తెలిపారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును మూడు రోజులుగా గృహనిర్బంధంలో ఉంచడం గర్హనీయమని తెలిపారు. అరెస్టు చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ హియరింగ్‌లో ప్రజలందరూ పాల్గొని వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలియజేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యని తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వారికి అనుకూలంగా ఉండే వారిని ఆహ్వానించడం, వ్యతిరేకించే వారిపై నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమైన చర్యని, దీనిని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, స్వేచ్ఛగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేలా పరిస్థితులు ఉండాలని శ్రీనివాసరావు కోరారు.


cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్