గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలలితా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ

2 గంటల క్రితం

లలితా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ 
- నేడు మూలనక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు
- పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నేడు మూలనక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు

  • పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన గురువారం దుర్గమ్మను లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరించారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. శ్రీకాకుళానికి చెందిన కె.దుర్గా శ్రీనివాస్ రూ.75 లక్షల విలువైన 494 గ్రాముల నవరత్న ఖచిత స్వర్ణ కిరీటాన్ని బహూకరించారు. విజయవాడ మోడ్రన్ కన్‌‌స్ట్రక్షన్స్ ఎండి పంగులూరి శేషగిరిరావు, సునీత దంపతులు రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లాలు బహూకరించారు. అన్నవరం దేవస్థానం ఇఒ చక్రధరరావు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఇఒ శ్రీనివాసరావు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఒ వి.కె.శీనా నాయక్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం మూలా నక్షత్రం (శ్రీ సరస్వతీ దేవి అలంకారం) సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ విఐపి దర్శనాలను రద్దు చేసి, క్యూలైన్లన్నీ పూర్తిగా ఉచిత దర్శనాలుగా మార్చారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపైకి వాహనాలను నిషేధించి, నగరంలో ట్రాఫిక్ ను మళ్లించారు. దాదాపు ఐదు వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్