బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాలిక ఆచూకీ తెలుసుకోలేరా?

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

  • రేపటి లోగా తమ ముందు హాజరుపర్చాలని ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి :గుంటూరుకు చెందిన పదో తరగతి బాలిక మూడు నెలలుగా కనిపించకుండా పోయినా ఇప్పటి వరకూ ఆచూకీ తెలుసుకోలేకపోవడంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బాలికను కిడ్నాప్‌ చేశారా, ఎవరైనా తీసుకెళ్లారా అనే విషయాలను తేల్చారా అని ఆరా తీసింది. బాలికను గురువారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గుంటూరులోని భాష్యం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదని వ్యాపారి వాసు జూన్‌ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 80 రోజులు గడిచినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది డివి శశిధర్‌ వాదనలు వినిపిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన షేక్‌ జాన్‌ సైదా అలియాస్‌ రబ్బానీ బాలికను తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రబ్బానీ ఉపయోగించిన బైక్‌, బాలికను నెల్లూరుకు తీసుకెళ్లడం, అక్కడ ఫోన్‌ కొనడం, కోయంబత్తూరులో లాడ్జిలో బస చేయడం, అక్కడి నుంచి కేరళ, హైదరాబాద్‌ వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రబ్బానీ మొబైల్‌ నంబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ, చిరునామా కూడా పోలీసులకు తెలుసని చెప్పారు. బాలిక తన వెంట 200 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు తీసుకెళ్లినట్లు తెలిపారు.


పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కృష్ణ ప్రణీత్‌ వాదిస్తూ, బాలిక ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మూడు రాష్ట్రాలకు వెళ్లి గాలింపు చేపట్టామని చెప్పారు. కేసు నమోదైన వెంటనే బాలిక, రబ్బానీ ఎక్కడ ఉన్నారో గుర్తించినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లే సమయానికి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారని ఎలా నమ్మాలని ప్రశ్నించింది. జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కృష్ణ ప్రణీత్‌ కోరగా, ధర్మాసనం నిరాకరించి డిజెపికే ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్