బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేరళంలో విద్యార్థులపై ఖాకీల క్రౌర్యం

1 గంట క్రితం

keralam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నిస్సిగ్గుగా సమర్థించుకున్న రాష్ర్ట హోంమంత్రిచెన్నితల

  • పోలీసుల దాడిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌‌ఐ భారీ ర్యాలీ

తిరువనంతపురం : కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ మొదలు ఆ పార్టీ నేతలందరూ విద్యార్థులపై జరుగుతున్న పోలీసుల దాడులను ఖండిస్తూ గళమెత్తుతుంటారు. కానీ అదే కాంగ్రెస్‌ నేతృత్వ యుడిఎఫ్‌ అధికారంలో ఉన్న కేరళలో మాత్రం పోలీసులు విద్యార్థులపై పైశాచిక దాడులకు పాల్పడుతున్నారు. విశ్వవిద్యాలయాల ‘కాషాయీకరణ’కు వ్యతిరేకంగా భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. విద్యార్థినులతో పాటు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ బుధవారం కేరళం రాజధాని తిరువనంతపురంలో సచివాలయం వద్దకు ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులను ఉపయోగించి బలప్రయోగానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కార్యకర్తలు సచివాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనేక పర్యాయాలు వాటర్ క్యానన్లను ఉపయోగించారని, లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కూడా ప్రదర్శనలు జరిగాయి. పాలక్కడ్‌లో ఎస్పీ కార్యాలయం వైపు వెళుతున్న నిరసనకారులపై పోలీసులు నాలుగు సార్లు నీటి ఫిరంగులు ప్రయోగించారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా కేరళ విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించారు. ఆర్‌ఎస్‌ఎస్ అజెండా ప్రకారమే ఈ కార్యక్రమం జరిగిందని ఎస్‌ఎఫ్‌ఐ మండిపడింది. యూనివర్సిటీ కేంద్ర కార్యాలయం వద్దకు మంగళవారం ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థినులు సహా నిరసనకారులపై పోలీసులు బలప్రయోగానికి దిగారని ఆరోపించింది. కేంద్ర కమిటీ సభ్యులు ఆర్య ప్రసాద్, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు వైష్ణవి షాజీ సహా పలువురు నేతలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాశవిక దాడికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రసాద్, షాజీ తల, ముఖంపై గాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామని తెలిపింది. కాగా మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ప్రదర్శన సందర్భంగా పోలీసు చర్యను రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితల సమర్ధించారు. ప్రదర్శనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లనే నీటి ఫిరంగులను ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా పోలీసు చర్యను ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. కేరళ యూనివర్సిటీ వద్ద జరిగిన ప్రదర్శనలో మహిళా నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని ఆరోపించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్