జనవరిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం : మంత్రి నారాయణ
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ను ఐటి హబ్‌గా అభివృద్ధి చేసిన తరహాలో అమరావతిని క్వాంటం కంప్యూటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ క్వాంటం వ్యాలీ మిషన్‌లో భాగంగా సుమారు 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటం కంప్యూటింగ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ‘రూమ్ వితిన్ రూమ్’ కాన్సెప్ట్‌తో ల్యాబ్‌ను రూపొందిస్తున్నామని, ఇందుకోసం జర్మన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, క్వాంటం చిప్‌లను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబరిచేందుకు హీలియం కంప్రెసర్లు, క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ వంటి అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, జనవరిలో ప్రారంభం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. సెప్టెంబర్ 15 నాటికి ఎల్‌అండ్‌టి సంస్థ ఎంఇపి పనుల కోసం భవనాన్ని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్ 48 అంతస్తులతో, 202 మీటర్ల ఎత్తు ఉండేలా డిజైన్ చేసిన క్వాంటం కంప్యూటింగ్ భవనం పక్కనే రెండు భారీ టవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి చెప్పారు.








కామెంట్‌లు (0)