ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటలు ధ్వంసం చేసిన వారిపై కేసులు

11 గంటల క్రితం

ram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్ డిమాండ్‌

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్ : ​విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌ ‌లైన్ల ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో దళిత రైతుల పంటను జెసిబిలతో ధ్వంసం చేసిన​ పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యు‌లు వి రాంభూపాల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అనంతపురం గణేనాయక్‌ ‌భవన్‌‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మనహల్‌ మండలం సీదారఘట్ట గ్రామంలోని రైతుల భూములను 'రిసోనియా' అనే ప్రైవేట్ కంపెనీకి కారుచౌకగా ప్రభుత్వం కట్టబెట్టింద‌ని విమర్శించారు. ఎల్బీనగర్‌కు చెందిన దళితులు అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మీదేవి, సుంకన్న రైతుల సాగు భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. భూములు ఇవ్వబోమని చెబుతున్నా వందలాది మంది పోలీసులతో వచ్చి భయాందోళనలు సృష్టించి, పచ్చని పంటలను జెసిబిలతో నాశనం చేయడం సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ​నంద్యాల జిల్లాలో కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారం ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు సెంటుకు రూ. 85,000 చొప్పున పరిహారంతో పాటు, జాతీయ రహదారి సమీప భూములకు అదనంగా 150 శాతం భూమి ధర, ఆర్‌ఒడబ్ల్యు పరిహారం 30 శాతం, పంటలు, బోర్‌వెల్‌లకు నష్టపరిహారాన్ని నిర్ణయించారన్నారు. నంద్యాల తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనలను ఇక్కడ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. పంటలను ధ్వంసం చేసిన అధికారులపై ఎస్‌‌సి, ఎస్‌‌టి అత్యాచార నిరోధక (పిఒఎ) చట్టం కింద వెంటనే కేసులు నమోదు చేయాలని, ​పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేసి, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై కలెక్టర్, ఎస్‌‌పిలు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేసేలా వ్యవహరించాలన్నారు. ​రైతుల కడుపు కొట్టి ప్రయివేటు కంపెనీలకు లాభాలు రాసిచ్చే వైఖరిని ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో బాధితుల తరఫున సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఒ నల్లప్ప, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ​ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు ​టి రామాంజనేయులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్