మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకక్షసాధింపు..

1 గంట క్రితం

నిరుద్యోగులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు  శాంతియుత ఆందోళనకు దిగిన వారిపై పోలీసుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:47 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నిరుద్యోగులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు

  • శాంతియుత ఆందోళనకు దిగిన వారిపై పోలీసుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళనకు దిగిన నిరుద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. వారిపై పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులని కూడా చూడకుండా కేసులను బనాయించింది.

పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరుతూ కాకినాడలో నిరుద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. వారిపైనా, వారికి మద్దతుగా నిల్చిన డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపైనా, కాకినాడలో పోలీసు ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్న శ్యామ్ ఇనిస్టిట్యూట్ పైనా పోలీసులు కక్షసాధింపు చర్యలకు దిగారు. ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నారనే నెపంతో డివైఎఫ్ఐ నాయకులు టి.రాజా, రాజేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.గంగాసూరిబాబుపైనా, ధర్నాకు అభ్యర్థులను ప్రేరేపించారంటూ శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ పైనా, మరో 20 మంది విద్యార్థులపైనా మొత్తం 24 మందిపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 189 (2) 189 (3) 189 (5) 189 (6), 285, 126 (2), 292 సెక్షన్ల కింద కేసు పెట్టారు. విద్యార్థుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్యామ్ ఇనిస్టిట్యూట్ లో తనిఖీలు

పోలీసు ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తోన్న కాకినాడలోని శ్యామ్ ఇనిస్టిట్యూట్ ను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ఇనిస్టిట్యూట్‌‌లో తనిఖీ చేశారు. ఇనిస్టిట్యూట్‌ ‌నిర్వాహకులు శ్యామ్‌ ‌ను విచారించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఈ ధర్నాలో ఉన్నారా? స్వచ్ఛందంగా పాల్గొన్నారా? లేక ఎవరైనా ప్రేరేపించారా? అంటూ ఆయనను ప్రశ్నించారు. మంగళవారం తెల్లవారుజామున ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇనిస్టిట్యూట్ కు చెందిన వసతిగృహం లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ధర్నాలో ఎవరెవరు పాల్గొన్నారంటూ హడావుడి చేశారు. అభ్యర్థుల వివరాలను సేకరించారు. దీంతో, అభ్యర్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం తగదు : గుంటూరు శ్యామ్

​ ధర్నా చేశారనే నెపంతో శ్యామ్ ఇన్ స్టిట్యూట్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు భయ భ్రాంతులకు గురిచేయడం తగదని శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ అన్నారు. మంగళవారం ఆయన తన ఇనిస్టిట్యూట్‌ ‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసుల దాడిలో కుట్ర కోణం ఉందని, తమ ఇనిస్టిట్యూట్‌ ‌ప్రతిష్ట దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులపైనా, తనపైనా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు. లేకపోతే న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. తాను, తన భార్య ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో 26 ఏళ్లుగా సంస్థను నడుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తమ ఇనిస్టిట్యూట్‌ ‌లో శిక్షణ పొందిన వారిలో 25 వేల మంది వరకూ పోలీసు ఉద్యోగాలు పొందారని శ్యామ్ తెలిపారు. తమ సంస్థపై నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు చేశారని చెప్పారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులు కాకినాడలోనే ఉంటూ కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరుతూ వినతిపత్రం కూడా అందించానని తెలిపారు.

అప్రజాస్వామికం : సిపిఎం

పోలీస్‌ నోటిఫికేషన్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేసిన నిరుద్యోగ యువతను వెంటాడి వేధించడం, అక్రమంగా కేసులు బనాయించడం అప్రజాస్వామ్యమని సిపిఎం కాకినాడ రూరల్ కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు అన్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ డిఆర్ఒ డాక్టర్ టి.నాయక్ కు సిపిఎం నాయకులు వినతిపత్రం అందించారు. నిరుద్యోగ విద్యార్థులపైనా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులపైనా, ధర్నాతో ఎటువంటి సంబంధమూలేని శ్యామ్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ పైనా, పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు. విచారణ పేరుతో శ్యామ్ ను పోలీస్‌ ‌స్టేషన్లో సోమవారం గంటల తరబడి ఉంచడం దారుణమన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఎం నాయకులు పెదింశెట్టి రామకృష్ణారెడ్డి, చింతపల్లి అజయ్ కుమార్, తొట్టిపూడి రాజా తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్