అక్టోబర్ 9న తుది జాబితా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు రేపే (10వ తేది) చివరి తేది. ఈ మేరకు సిఇఓ కార్యాలయం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఫారం-6, 7, 8 దరఖాస్తులను ఈ నెల 10 వరకు సమర్పించవచ్చు. మ్యాపింగ్, లాజికల్ తేడాలు లేని 44.28 లక్షల మంది ఓటర్లకు విచారణ షెడ్యూల్ నోటీసులను ఈ నెల 28లోగా జారీ చేస్తారు. క్లెయిమ్స్‌పై విచారణ, ఎంక్వైరీల ను అక్టోబర్ 5లోగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 9న ప్రచురించనున్నారు. ఈ నెల 8 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఫారం-6 కింద 2.60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా 23,960 దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉంది. నెల్లూరులో 19,900, తిరుపతిలో 13,056, పశ్చిమ గోదావరిలో 13,003, ప్రకాశంలో 12,968 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫారం-7 కింద 8,917, ఫారం-8 కింద 1.53 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయాలి. 44.28 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా.. 38.72 లక్షల మందికి విచారణ పూర్తయింది. ఇది 87.43 శాతంగా నమోదైంది. కర్నూలు, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, మార్కాపురం, నంద్యాల విచారణ ప్రక్రియలో మెరుగైన పనితీరు కనబరిచాయి. పల్నాడు 22.34 శాతం, ప్రకాశం 20.72, తిరుపతి 20.48 శాతంతో వెనుకబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 3.27 కోట్ల మంది ఓటర్లలో 1.37 కోట్ల మందిని తుది పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉంచారు. బాపట్ల, చిత్తూరు, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం మెరుగైన పురోగతి సాధించగా, ఎన్‌టిఆర్, గుంటూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలు వెనుకబడ్డాయి. దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి, విచారణను వేగవంతం చేయడంతో పాటు గడువులోగా తుది జాబితా విడుదల చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.







కామెంట్‌లు (0)