ప్రజాశక్తి-అమరావతి బ్యూరో / కలెక్టరేట్ (కృష్ణా) : జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారత జాతికి చిరస్మరణీయ సేవలు అందిచారని ఆదివారం ఎక్స్ ద్వారా తెలిపారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులని పేర్కొన్నారు.
• మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్‌కు అందించిన ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నామని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
• కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకమని వైసిపి అధినేత వైఎస్ జగన్ తెలిపారు. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య చిరస్మరణీయుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.
• పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో తెలిపారు.
భావితరాలకు స్ఫూర్తి : కొల్లు
భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం సర్కిల్ వద్ద ఉన్న పింగళి విగ్రహానికి ఎపిఎస్ ఆర్‌టిసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, భారత జాతీయ పతాక రూపకల్పనతో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. మచిలీపట్నంలోని నేషనల్ కళాశాలను సందర్శించడానికి వచ్చిన మహాత్మా గాంధీతో జాతీయ పతాక రూపకల్పనపై పింగళి వెంకయ్య చర్చించి, త్రివర్ణ పతాక నమూనాను సమర్పించారని గుర్తుచేశారు. అనంతరం ఆ పతాకంలో చరఖా ఉండగా, తర్వాత దాని స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి ప్రస్తుత జాతీయ జెండాను రూపొందించారని వివరించారు. ప్రపంచంలో ఎక్కడ భారత జాతీయ పతాకం రెపరెపలాడినా, దాని వెనుక పింగళి వెంకయ్య అపూర్వ కృషి, దూరదృష్టి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడు మన ప్రాంతంలో జన్మించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరును నామకరణం చేయడానికి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)