రామదాసు స్పూర్తితో కార్యకర్తలు ఉద్యమించాలి
సమస్యలపై యువత గళమెత్తడం దేశ భవిష్యత్‌కు శుభపరిణామం
సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ‘వీపనేని రామదాసు-వెంకట సుబ్బమ్మ’ల 6వ వర్ధంతి సభను తుమ్మల వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు గుండు సత్యనారాయణ సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామదాసు-వెంకటసుబ్బమ్మ దంపతుల విగ్రహాలకు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు సామాన్య ప్రజలపై భారంగా మారాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల విద్య, వైద్యం, ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వివరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు 24 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే... మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా అణచివేయాలని ప్రయత్నిస్తోందన్నారు. అయినా, యువత బెదిరిపోకుండా ఢిల్లీ వీధులను చుట్టుముట్టి ఉద్యమిస్తోందని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఉపాధి, నాణ్యమైన విద్య, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం ‘జెన్‌జెడ్’ యువత గళమెత్తడం దేశ భవిష్యత్తుకు శుభపరిణామమని తెలిపారు. మతం, కులం పేరుతో విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టి శాస్త్రీయ దృక్పథంతో, ప్రజాస్వామ్య విలువలతో యువత ముందుకు సాగాలని కోరారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ పేరుతో గిరిజనులు, దళితులు, మైనార్టీలు, పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఓటు నిరూపణకు పెట్టిన ప్రామాణికతలో ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు, పాస్‌పోర్టులు చెల్లడం లేదన్నారు. అన్నింటికి ఆధార్, ఓటర్ కార్డు అడుగుతారు కానీ ఎస్‌ఐఆర్‌కు మాత్రం కుదరదని చెబుతున్నారంటే పేదలకు ఓట్లు ఉండకూడదనే బిజెపి ఎజెండాలో భాగమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణచివేస్తూ ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు రామదాసు-వెంకటసుబ్బమ్మ స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)