ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర విధానాలతో పౌర స్వేచ్ఛకు విఘాతం

02 ఆగస్టు, 2026

parakala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 10:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పతనం దిశగా భారత ఆర్థిక వ్యవస్థ

- అప్పారి వెంకటస్వామి యుటిఎఫ్‌ భవన్‌ ప్రారంభోత్సవంలో పరకాల ప్రభాకర్

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : దేశంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పౌర స్వేచ్ఛ దెబ్బతింటోందని, ప్రశ్నించే వారిని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. యుటిఎఫ్ తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యాలయం ‘అప్పారి వెంకటస్వామి యుటిఎఫ్ భవన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు తగిన వేదికలు ఉండాలని, ప్రతి నిరసన స్థలం జంతర్ మంతర్‌లా మారినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. భారతదేశం వచ్చే పదేళ్లపాటు సుమారు పది శాతం ఆర్థిక వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత యువ జనాభా దేశానికి అపూర్వ అవకాశమని తెలిపారు. సమాజ మార్పుకు ఉపాధ్యాయులు, యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఎంఎల్‌‌సి గోపి మూర్తి మాట్లాడుతూ యుటిఎఫ్ భవనం ఉపాధ్యాయ ఉద్యమాలకే కాక అన్ని ప్రజా ఉద్యమాలకూ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అనుసరిస్తోందని, ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలతో ప్రభుత్వ విద్య బలహీనపడుతోందని వివరించారు. మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ ప్రాథమిక విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో యుటిఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు. మాజీ ఎంఎల్‌‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు మందగించిన సమయంలో విద్యార్థి ఉద్యమాలే కొత్త ఊపు తీసుకొచ్చాయని అన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు, అప్పారి వెంకటస్వామి కుమారుడు హైకోర్టు న్యాయవాది అప్పారి సత్య ప్రకాష్, ఎస్‌‌టిఎఫ్‌ఐ జాతీయ మాజీ కార్యదర్శి అరుణ కుమారి పాల్గొన్నారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, వివిధ బ్లాకులను ఆహూతులు ప్రారంభించారు. తొలుత యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యమ గీతాలు ఆలపించారు. అనంతరం ఎర్రజెండాలతో ర్యాలీగా సభా వేదిక వద్దకు తరలి వెళ్లారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్