- మహిళా ఉద్యోగినికి ఊరట
- ఉద్యోగోన్నతి పరిశీలించాలని హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : ఓ వృద్ధుడితో ఫోన్ సంభాషణలో ‘మీకు చెప్పాలా’ అనే పదం ఉపయోగించినందుకు మహిళా రెవెన్యూ ఉద్యోగినిపై విధించిన సెస్సూర్ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. సాధారణ స్థానిక భాషలో ఈ పదాన్ని అమర్యాదకరమైనదిగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సమర్థనీయం కాదంది. శిక్ష కారణంగా నిలిచిపోయిన ఉద్యోగోన్నతి కోసం ఆమె పేరును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ న్యాపతి విజయ్ తీర్పు చెప్పారు. మాలతి 2005లో కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్నారు. తహశీల్దారు ఉద్యోగోన్నతికి అర్హురాలైన ఆమె పేరు సీనియారిటీ జాబితాలో 238వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరిన డి ప్రభాకర్‌రావుతో మాట్లాడే క్రమంలో ‘మీకు చెప్పాలా’ అని అగౌరవంగా మాట్లాడారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు ఆమెకు సెస్సూర్ శిక్ష విధించారు. దీంతో సెస్సూర్ శిక్ష అమల్లో ఉందనే కారణంతో ఆమె కంటే జూనియర్లకు తహశీల్దారు ఉద్యోగోన్నతలు కల్పించి, ఆమె పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మాలతి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపున 1997 జిఓ నెంబరు 53 ప్రకారం సెస్సూర్ శిక్ష పొందిన ఉద్యోగికి ఏడాది పాటు ఉద్యోగోన్నతి అర్హత ఉండదని వాదించారు. అయితే, మాలతి సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించలేదని, కేవలం ‘మీకు చెప్పాలా’ అనే పదాన్ని ఉపయోగించినంత మాత్రాన దానిని అమర్యాదకరమైన ప్రవర్తనగా లేదా శిక్షార్హమైన తప్పుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అందువల్ల సెస్సూర్ శిక్షను రద్దు చేస్తూ, మాలతి పేరును తహశీల్దారు ఉద్యోగోన్నతి కోసం నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.








కామెంట్‌లు (0)