గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో సిపిఎం బృందం పర్యటన

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సంస్థలను ప్రభుత్వమే నిపుణులను నియమించి నిర్వహించాలి

- జీవో నెంబర్ 69 రద్దు చేయాలి

- అధ్యాపకులను నియమించి మెరుగైన విద్య అందించాలి

- మెరుగైన వసతి, భోజన సదుపాయం కల్పించాలి

- గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన సిపిఐయం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్

ప్రజాశక్తి - విశాఖ : పిపిపి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీల భవనాలు, స్థలాలు ఫిజిక్స్ వాలా, నారాయణ కోచింగ్ సెంటర్లకు దారాధత్తం చేయకుండా, ప్రభుత్వమే నిపుణులను నియమించి నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మారికవలస గురుకుల పాఠశాలను సిపిఎం జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటించి విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 12 చోట్ల దళిత, గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్, జెఈఈ పరీక్షల్లో శిక్షణ ఇవ్వడానికి అదే తరగతులకు చెందిన విద్యార్థులను బలి చేయకుండా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ భవనాలలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల కోసం తల్లిదండ్రులను లెక్క చేయకుండా బలవంతంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా రాత్రికి రాత్రి తరలించడంతో మారికవలస సహా అనేక చోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం చేయొద్దని ప్రతిఘటించిన విషయాన్నీ గుర్తు చేశారు.

మెరుగైన విద్యను అందించడానికి విశాఖ జిల్లా మారికవలస ప్రాంతంలో స్కూలు, కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని, అనేకమంది ఈ విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విద్యాసంస్థలో జెఈఈ మెయిన్స్, నీట్ వంటి కోచింగ్ విద్యార్థులకు అందిస్తున్నారని, దానిలో లోపాలేమైనా ఉంటే సరిదిద్దాల్సింది పోయి మొత్తం విద్యార్థులు లేకుండా ఖాళీచేసి ప్రయివేట్ కోచింగ్ సెంటర్ కు అప్పగించడం సరైంది కాదన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 69 తీసుకొని వచ్చిందని, తక్షణమే ఈ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ పేరుతో ఫిజిక్స్ వాలాకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నిర్వాహాణ కోసం ఋషికొండ వద్ద వున్న భవణాన్ని లేదా ఐటీ కంపెనీల కోసం వందలాది ఎకరాలు భూమి కేంటాయించిన దానిలో ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మారికవలసలో ఉన్న విద్యార్థులను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించడంతో వారి తల్లిదండ్రులు, గిరిజన సంఘం, విద్యార్థి సంఘాలు పోరాడిన ఫలితంగా ఇక్కడ నుండి తరలించిన విద్యార్థులను తిరిగి మారికవలస గురుకులంకు తీసుకువచ్చారు. ఇక్కడ కనీసం వసతులు లేవు, ఉదయం టిఫిన్, భోజనం సరిగ్గా పెట్టడం లేదు, 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకులు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా ఇక్కడ 9-10 తరగతి విద్యార్థుల వసతి, పడుకోవడానికి మంచాలు లేక నేలపై నిద్ర పోతున్నారు. శుభ్రత లేదు. దోమలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, అధ్యాపకులను నియమించాలని, విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని కోరారు.

ఈ పర్యటనలో సిపిఐయం విశాఖ జిల్లా కార్యదర్శి యం జగ్గు నాయుడు, కార్యదర్శవర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి కుమార్, బి జగన్, వి కృష్ణా రావు, జోన్ నాయకులు డి అప్పలరాజు, రాజు కుమార్, కొండమ్మ, కుమారి, నరేంద్ర కుమార్, రెడ్డిపల్లి బాబురావు, కిరణ్, శేషు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్