- ఆస్ప్రతి నుండే రాజీనామా లేఖ
- అంతకుముందు తీవ్రస్థాయిలో మంత్రుల ఒత్తిడి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి, విజయవాడ సిటీ : విజయ డెయిరీ చైర్మన్‌గా మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన చలసాని ఆంజనేయులు 24 గంటలు గడవకముందే ఆ పదవి నుండి తప్పుకున్నారు. అంతకుముందు చలసాని కేంద్రంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చలసాని ఆ పదవికి పోటీ చేయడం పట్ల టిడిపి అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉండటంతో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధి ఆయనను పదవి నుండి తప్పుకోవాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో ఆయన గుండెపోటుకు గురై ఆస్ప్రతి పాలయ్యారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆస్ప్రతి నుండే శుక్రవారం సాయంత్రం ఆయన రాజీనామా లేఖను డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కు పంపారు. ఛైర్మన్ తో పాటు, డైరక్టర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆస్ప్రతిలో చికిత్స పొందున్న చలసానిని మంత్రి పార్ధసారధి శుక్రవారం కలిసి పరామర్శించారు. ఆ తరువాత కాసేపటికే ఆయన పదవి నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలోనూ, డెయిరీ వర్గాల్లోనూ కలకలం రేపాయి. చలసానిని కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయ డెయిరీ చైర్మన్ పదవిపై పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. వరుసగా ఏడేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ ముందుగానే పోటీ చేయవద్దని సూచించిందని, పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు గౌరవించడం డెయిరీ బలోపేతానికి అవసరమని ఆయన చెప్పారు.
విజయ డెయిరీపై రాజకీయ పడగ
రాష్ట్రంలో పేరుపొందిన విజయ డెయిరీని నిర్వీర్యం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుకూల వ్యక్తిని పెట్టుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా చలసానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారని అంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ విజయ డెయిరీపై ఇదే తరహా ఒత్తిడి నడిచింది. అప్పట్లో మండవ జానకిరామయ్య ఎదుర్కొని నిలిచారు. హెరిటేజ్ డెయిరీ కోసమే కృష్ణా జిల్లాలో పేరుపొందిన విజయ డెయిరీని దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.50 లక్షల మంది రైతులకు సంబంధించి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారులు పరస్పర సహాయ సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ)కి సుమారు రూ.1,200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విజయ డెయిరీ సహకార రంగంలో నడుస్తున్న అత్యంత విశ్వసనీయమైనది. దాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేటు డెయిరీలకు, ప్రత్యేకించి హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చడానికే ఇది జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెయిరీకి 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో రొటేషన్ పద్ధతిలో ప్రతియేటా ముగ్గురికి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం కొత్తగా వచ్చిన సభ్యులతో కలిసి అందరూ ఓటింగు పద్ధతిలో ఐదేళ్లకోసారి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ విజయ డెయిరీకి పోటీ లేకుండా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. గురువారం కూడా ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వీరిలో ప్రస్తుత ఛైర్మన్ చలసాని ఆంజనేయులు బాపులపాడు మండలం కాకులపాడు సోసైటీ నుండి డైరెక్టరుగా ఎన్నికయ్యారు. చిన్న ఆగిరిపల్లి నుండి పల్లగాని రాంబాబు, గన్నవరం మండలం దావాజీగూడెం నుండి గొంది నరేంద్ర ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో మరొక నామినేషన్ లేకపోవడంతో చలసాని ఆంజనేయులు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయ డెయిరీపై తొలి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. సొసైటీ మొత్తం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అవినీతి జరుగుతోందని అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఇటీవల చలసానిపైనా వ్యక్తిగత విమర్శలకు దిగారు.
రాజీనామాకు మంత్రుల పట్టు!
ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికలు జరిగి చలసాని అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధి నేరుగా డెయిరీకి చేరుకున్నారు. ఛైర్మన్‌గా రాజీనామా చేయాలంటూ చలసానిపై ఒత్తిడి తెచ్చారు. తాను ఎన్నికయ్యానని, సొసైటీ నిబంధనల ప్రకారం ఎన్నిక జరిగిందని మంత్రులకు వివరించారు. అయినా రాజీనామా చేయాల్సిందేనని, పార్టీ సూచించిన అభ్యర్థిని పెట్టుకుంటామని ఒత్తిడి తెచ్చారు. దీంతో చలసాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చెమటలు పట్టి ఆందోళనకు గురవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఎన్నిక రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి
రాజీనామా చేయడానికి చలసాని తొలుత అంగీకరించకపోవడంతో ఆయన ఎన్నికను రద్దు చేయాలని,
లేదా ఎన్నికైనట్లు నిర్థారించిన పేపర్లను చించేయాలని సహకార అధికారిపై శుక్రవారం ఉదయం మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కలిసేందుకు నిరాకరించారు. అతన్ని ఎవరూ కలవడానికి వీల్లేదని మంత్రులు కూడా ఆంక్షలు పెట్టినట్లు తెలిసింది. విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని, తామంతా ఆయనకే మద్దతు ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు. ఆంజనేయులు ఛైర్మన్ కావడం ఇష్టం లేనప్పుడు, ప్రభుత్వానికి వేరే ఆలోచన వున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పిలిపించి పోటీ చెయ్యొద్దని చెబితే బావుండేదని, నోటిఫికేషన్‌కు ముందే ఛైర్మన్ ఆంజనేయులు తాను నామినేషన్ వేస్తున్నట్టు పార్టీ పెద్దలకు చెప్పారని అంటున్నారు.
డెయిరీ మ్యాక్స్ చట్టం ప్రకారం నడుస్తోందని, పార్టీలకతీతంగా పాడి రైతులకు, పాల వినియోగదారులకు సేవ చేస్తోందని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని డైరక్టర్లు అంటున్నారు. వైసిపి అధికారంలో వున్నప్పుడు డెయిరీ అమూల్ పరం కాకుండా కాపాడినందుకు ఈ ప్రభుత్వం ఇస్తున్న బహుమానమా? అని వారు ప్రశ్నించారు.
హెరిటేజ్ కోసం విజయ సహకార డెయిరీని బలి చేస్తారా? : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
హెరిటేజ్ కోసం విజయ సహకార డెయిరీని బలి చేస్తున్నారని, ఎన్నికైన కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో అధికార పార్టీ రాజకీయ జోక్యం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1960లో ప్రారంభమై లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి అయి రైతుల ఆస్తిగా ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డెయిరీని హెరిటేజ్‌కు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులను రంగంలోకి దింపి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మిల్క్ యూనియన్ డైరెక్టర్లను, ఛైర్మన్‌ను అడ్డగోలుగా దించి తమ తొత్తులతో నింపే ప్రయత్నం హెరిటేజ్ ప్రయోజనాల కోసమే అన్నది వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. వెంటనే ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
విజయ డెయిరీని దెబ్బతీసే కుట్రను తిప్పికొట్టాలి : పాల రైతు సంఘం
విజయ డెయిరీని దెబ్బతీసే కుట్రను తిప్పికొట్టాలని పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజాస్వామ్య ఎన్నికను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు మంత్రులు.. చలసాని ఆంజనేయులును రాజీనామా చేయాలని కోరడం విడ్డూరమని ఒక ప్రకటనలో ఖండించారు. వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్‌గా ఎన్నికైన చలసానిని రాజీనామా చేయాలని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. చంద్రబాబు సొంత డెయిరీ హెరిటేజ్ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార డెరీలను ధ్వంసం చేస్తున్నారన్నారు.
కుట్రలు చేస్తున్నారు : పుత్తా శివశంకర్
కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవమై ఛైర్మన్‌గా ఎన్నికైన చలసానిని తప్పించే యత్నంలో ఆయనపై మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చారని వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తెలిపారు. ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. గతంలో హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ నిర్వీర్యం చేశారని, ఇప్పుడు విజయ డెయిరీలోనూ కుట్రలు చేస్తున్నారని అన్నారు.








కామెంట్‌లు (0)