-బాల సంజీవని టెండర్లపై సమగ్ర విచారణ
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత పింఛన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వృద్ధులను అవమానించేలా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పింఛను సొమ్మును కొంతమంది తాగడానికి వినియోగిస్తున్నారని సిఎం వ్యాఖ్యానించడం అభ్యంతరకరమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని వృద్ధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పింఛను పెంచాలని, కొత్తగా అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్న సమయంలో సిఎం వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎక్కడో జరిగిన ఘటనను మొత్తం పింఛనుదారులకు ఆపాదించడం అన్యాయమని పేర్కొన్నారు. పింఛను దానం కాదని, అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వృత్తిదారులకు సామాజిక భద్రతలో భాగంగా అందే హక్కు అని తెలిపారు. ఉద్యోగులు, పింఛనుదారుల బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. జీవన వ్యయానికి అనుగుణంగా పింఛను పెంచాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
బాల సంజీవని టెండర్లపై సమగ్ర విచారణ
బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ పథకాలకు సంబంధించిన రూ.172.80 కోట్ల టెండర్లలో అక్రమాలకు తావులేకుండా సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో పౌష్టికాహార పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.అదే తరహాలో ఎపిలో డ్వాక్రా మహిళలకు బాల సంజీవని పథకంలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. టెండర్లలో కేంద్ర మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు సూచనలు, సివిసి నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేపట్టాలన్నారు. 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పునఃటెండర్లలో డ్వాక్రా సంఘాలకు అవకాశం కల్పించడంతోపాటు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం అందేలా చూడాలని ఈశ్వరయ్య కోరారు.








కామెంట్‌లు (0)