- ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘తల్లికి వందనం’ పథకం అమలులో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ‘తల్లికి వందనానికి పంగనామం.. బిడ్డలకు ఎగనామం’ ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలోని ‘అమ్మఒడి’ పథకంపై విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ప్రతి బిడ్డకు రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి అమలులో కోతలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 67 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేయడం వల్ల సుమారు 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని షర్మిల ఆరోపించారు. రూ.15 వేల సాయం పేరుతో రూ.2 వేల చొప్పున పాఠశాల అభివృద్ధి నిధి పేరుతో కోత విధించడం సమంజసం కాదని వెల్లడించారు. అలాగే, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం, కార్లు, ఇతర అర్హతల పేరుతో లబ్ధిదారులను పథకం నుంచి తప్పించడం గత ప్రభుత్వాన్ని విమర్శించిన విధానానికే విరుద్ధమని పేర్కొన్నారు. 'తల్లికి వందనం' పథకాన్ని నిజాయితీగా అమలు చేయాలంటే యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 87 లక్షల మంది విద్యార్థులందరికీ ఎలాంటి కోతలు లేకుండా ఒక్కో బిడ్డకు రూ.15 వేల చొప్పున అందించాలని, ప్రస్తుతం పథకానికి దూరమైన 20 లక్షల మంది విద్యార్థులను కూడా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)