ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం
రుసుములు వసూళ్లకై బ్యాంకులు, ఇతర సంస్థలకు అధికారం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : యుపిఐ లావాదేవీలను ఇప్పటివరకు ఉచితం. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టగా.. ఎటువంటి చర్చలేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రతిపక్షాల నిరసన తెలుపుతున్నా బిజెపి ప్రభుత్వం పట్టించు కోలేదు. కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే, యుపిఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఇతర సేవా సంస్థలకు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు- 2026 పేరుతో రూపొందిన ఈ బిల్లును గురువారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 బిల్లు, ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్-2025 బిల్లు, ఫైనాన్స్ యాక్ట్-2026లకు సవరణ చేసిను ఈ బిల్లును లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదించడం గమనార్హం.
యుపిఐ లావాదేవీలకూ ఛార్జీలు?
యుపిఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఛార్జీలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీనితో ఇప్పటివరకు యుపిఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) రద్దవుతుంది. ఇంతకుముందు ఆర్‌టిజిఎస్, నెఫ్ట్ లావాదేవీలపైనే ఛార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు యుపిఐ లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించేందుకు మోడీ సర్కార్ మార్గం సుగమం చేసింది. యుపిఐ లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ, ఇకపై యుపిఐ లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించనున్నారు. ఏ తరహా పేమెంట్‌పై ఎంత ఛార్జీ అనేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, పేమెంట్స్ విధానాన్ని నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం అందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామని కేంద్రం చెప్పుకొచ్చింది. ప్రతిపక్షాలు యుపిఐ వినియోగదారులపై భారం వేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించాయి. ఇక, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలి. తరువాత రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా అమలులోకి వస్తుంది. మరోవైపు రాజ్యసభలో అప్రిపియేషన్ బిల్లును ఆమోదించారు.
12న ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లు వచ్చే అవకాశం
మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఎఫ్‌సిఆర్ఎ సవరణ బిల్లును ఈ నెల 12వ తేదీన పార్లమెంటులో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పటికీ, తీవ్ర నిరసనల కారణంగా వాయిదా పడింది. గురువారం, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సిబిసిఐ) ప్రతినిధి బృందం హోం మంత్రి అమిత్ షాను కలిసి, ఎఫ్‌సిఆర్ఎ బిల్లుపై మరోసారి తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసింది. కొన్ని వారాల క్రితం, సిబిసిఐ బృందం అమిత్ షాను కలిసి ఆందోళనలను లేవనెత్తింది. అప్పుడు అమిత్ షా, ఈ బిల్లు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)