• ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం రూపకల్పన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక జోరుగా కొనసాగించనుంది. దీనికోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) విధానం-2026 ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. అదేవిధంగా కార్పొరేట్లకు పెద్దపీట వేసేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం రూపకల్పనకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి విలేకరులకు వివరించారు. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పిపిపి నూతన పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పిపిపి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో ఉండగా, ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన రాష్ట్ర విజిఎఫ్‌తో పాటు, ప్రారంభ దశలో లాభదాయకంగా లేకపోయినా భవిష్యత్తులో ఆదాయం వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేకమైన ‘బ్రిడ్జ్ ఫండ్’ను కూడా ఈ పాలసీలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఉద్దేశంతో పలు చట్టాలను ఏకకాలంలో సవరించే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘ఆంధ్రప్రదేశ్ ఆమ్‌నిబస్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం-2026 రూపకల్పనకు ఆమోదం తెలిపామని చెప్పారు. పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడం, వ్యాపారాలకు ఆటంకంగా ఉన్న పాత నిబంధనలను సరళీకృతం చేయడం, అనుమతుల ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. ఒకే బిల్లు (ఆమ్‌నిబస్) ద్వారా వివిధ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ విధానాలను మరింత పారదర్శకంగా మార్చనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు - క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు ఆమోదం తెలిపామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత - 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత - 2023 చట్టాలు అమల్లోకి వచ్చాయని, మహిళలు, పిల్లల రక్షణ చర్యలను అవి మరింత బలోపేతం చేశాయని, కాబట్టి ఈ బిల్లును ఉపసంహరించుకోవడమే సబబు అని డిజిపి, న్యాయశాఖ ఇచ్చిన అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ ఒకటి నుంచి ఆక్వాకల్చర్ ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీ పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి (డిఇవో) పోస్టులను సృష్టించడంతో పాటు, మొత్తం డిఇఒ పోస్టుల్లో 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి, రాబోయే గ్రూప్–1 నోటిఫికేషన్‌లో 14 డిఇఒ ఖాళీలను చేర్చి భర్తీ చేసేందుకు అవసరమైన ఎపి ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్-1998లో తగిన సవరణలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రెయిన్ (పాదాచారులు) సేఫ్టీ అండ్ యునివ ర్సల్ ఆక్సెస్బిలిటీ పాలసీ -2026ను, దాని ఆప రేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు అనుమతినిచ్చామన్నారు. అయితే ఇందులో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని తొలగించే అంశం ఉంది. రాజధానిలో పలు ప్రతిపాదనలకు ఆమోదం రాజధాని అమరావతి రైతులకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో వార్షిక కౌలు చెల్లించేందుకు ఎపి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రూ.300 కోట్ల రుణాన్ని పొందేందుకు ఆమోదం తెలిపింది. సిఆర్‌డిఎ ప్రాంతంలోని వివిధ సంస్థలకు కొత్త భూ కేటాయింపులు, గతంలో జరిపిన భూ కేటాయింపుల సమీక్షకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలపై 28వ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలను, సిఆర్‌డిఎ తీర్మానం ఆమోదించిన ప్రతిపాదనకు ఆమోదించింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాల భూమిని గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా భూ సమీకరణ పథకం చేపట్టేందుకు సిఆర్‌డిఎ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది. హైకోర్టు భవనం నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల విస్తరించిన కన్సల్టెన్సీ సేవల పరిధికి, తదనుగుణంగా పెరిగిన కన్సల్టెన్సీ ఫీజుకు, శాసనసభ, హైకోర్టు భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్లను నియమించేందుకు, వారికి సంబంధించిన అదనపు కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపు కోసం జిఎస్‌టితో కలిపి రూ.206.59 కోట్లకు సవరించిన పరిపాలనా అనుమతిని ఆమోదించింది. ఈ సమావేశంలో సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పాల్గొన్నారు.
మరికొన్ని నిర్ణయాలు
పిఎం-కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కడప జిల్లాల్లో 101.01 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన నెడ్‌కాప్ ఎమ్‌డికి బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రెండెకరాల చొప్పున టిడిపి కార్యాలయం నిర్మాణం కోసం ఆయా జిల్లాల టిడిపి పార్టీలకు లీజు ప్రతిపాదికన బదిలీ చేసేందుకు ఆమోదించింది. నూతనంగా పునర్‌వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్‌వ్యవస్థీకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్ మొబైల్ సంస్థలకు మొబైల్ టవర్లు, అనుబంధ టెలికాం మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె రుసుము లేకుండా అందించడంతో పాటు, రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. గోదావరి పుష్కరాలు-2027 దృష్ట్యా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో 238 ‘స్నాన ఘట్టాల పనులు’ ఇతర పనుల కోసం రూ.210.06 కోట్లకు పరిపాలనా అనుమతినిచ్చింది.







కామెంట్‌లు (0)