బివి రాఘవులు డిమాండ్
జెన్‌జి, విద్యార్థి ఉద్యమాన్ని ప్రధాని గౌరవించాలి
రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం ప్రకటించాలి : వి శ్రీనివాసరావు
పొగాకు రైతును మోసగించిన ప్రభుత్వం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మహిళా బిల్లుతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టొద్దని, మహిళా బిల్లును విడిగా పెడితే ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఈ రెండిటినీ కలిపి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయనే తప్పుడు ప్రచారం చేసేందుకు, బిజెపి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ముందుకు వస్తున్నారని, వాటిని విడదీసి వేరువేరుగా ప్రవేశపె ట్టాలన్నారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం లేదని, ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదించలేదని తెలిపారు. అనిశ్చితిలో ఉన్న అంశాన్ని తీసుకు రావడం ద్వారా, మహిళా బిల్లును ఆమోదించకుండా చేసి ప్రతిపక్షాలపై నెపం నెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలతో చర్చించిన తరువాతే ఈ విషయమై ముందుకు పోవాలని కేంద్రానికి ఆయన సూచించారు. పైగా ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ప్రతిపక్ష పార్టీలను చీల్చి బిజెపి వైపు తిప్పుకునే ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు.
అమిత్‌షా సమాధానం చెప్పాలి
ఢిల్లీలో జరిగిన జెన్‌జీ, విద్యార్థి ఉద్యమం తరువాత కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన బిజెపి నిర్బంధాన్ని ఎదిరించి మరీ విద్యార్థులు నిలబడ్డారని అన్నారు. ఈ ఉద్యమాన్ని తప్పుబడు తూ ప్రధాని వీడియో కూడా రిలీజ్ చేయాల్సి వచ్చిం దని చెప్పారు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వారిపై నిర్బంధం ప్రయోగి స్తున్నారని, అటువంటి చర్యలు మానుకోవాలని హె చ్చరించారు. ఉద్యమాన్ని ప్రధాని గౌరవించాలని, ముద్రలు వేసి ఇబ్బంది పెట్టాలను కోవడం సరికాదని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులపై డిల్లీ పోలీసులు దారుణంగా విరుచుకు పడ్డారని, పెల్లెట్‌గన్స్ పేల్చారని అన్నారు. దీన్ని సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టిందని చెప్పారు. బాధ్యతవహిం చాల్సిన హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. దాడికి కారణమైన దోషులపై చర్యలు తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జెన్‌జీ, విద్యార్థి ఉద్యమం అనంతరం బీహార్ ఎన్నికల్లో బిజెపికి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్ నియోజవకర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనుక బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలి : వి శ్రీనివాసరావు డిమాండ్
రాష్ట్రంలో ఉపాధి కల్పనకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు, 11.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారని, ఉపాధి ఎక్కడా కనిపించడం లేదని ఆయన చెప్పారు. ముఖ్యంగా స్థానికులకు ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేవని, మరి ఉపాధి ఎవరికి కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీలుప్లాంటులోనే 10 వేల ఉద్యోగాలు పోయాయని అన్నారు. ఇప్పుడు గ్యాస్ లేక ఉత్పత్తి నిలిచిపోయిందని అన్నారు. స్పిన్నింగ్, డెయిరీ రంగంలోనూ ఉపాధి పోయిందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో సగానికిపైగా గ్రామీణ పేదలు పని కోల్పోయారని తెలిపారు.
పొగాకు రైతులను మోసం చేశారు
పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. కిలో రూ.250కు కొని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పడం, కిలోకు అదనంగా రూ.10 ఇస్తామనడం వారిని మోసం చేయడమేనని అన్నారు. పొగాకు కొనకపోవడంతో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వారితో సహా రైతులంతా ఆందోళనలో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణాడెల్టా ప్రాంతంలో పంటలకు నీరందించి ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఇప్పుడున్న నీటిలో రాయలసీమకు తాగునీరు ఇచ్చి డెల్టాలో పంటలు నష్టపోకుండా సాగునీరు ఇవ్వాలని కోరారు. పట్టిసీమ పంపింగ్ పెంచాలని సూచించారు.
కులనిర్మూలన మార్క్సిస్టు ధృక్పథం పుస్తకావిష్కరణ
‘ప్రజాశక్తి బుక్‌హౌస్’ ప్రచురించిన కుల నిర్మూలన, మార్క్సిస్టు ధృక్పథం’ పుస్తకాన్ని బి.వి.రాఘవులు, వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కుల నిర్మూలనయితేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జిడిపిలో నాలుగోస్థానంలోకి వెళుతున్నామని ప్రధాని మోడీ చెబుతున్నా కుల నిర్మూలన కాకుండా దేశం ముందుకు వెళ్లలేదని తెలిపారు. కులాన్ని ప్రోత్సహించడం అంటే శ్రమను అవమానించడమేనని, శ్రమను చులకనచేసే చోట అభివృద్ధి ఉండదని అన్నారు. కుల వ్యవస్థ చేసే తొలి పని శ్రమను చులకనచేయడమేనని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సమస్య పరిష్కారానికి అవసరమైన ఆలోచన చేయాలని రాఘవులు సూచించారు. పుస్తకావిష్కరణలో బుక్‌హౌస్ సంపాదకులు ఎం.వి.ఎస్.శర్మ, జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)