చీరాలలో నిధులు విడుదల చేయనున్న సిఎం
రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు అందించే నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న ‘12వ జాతీయ చేనేత దినోత్సవం’ను పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లను ప్రభుత్వం అందించనుందని ఆ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోందని పేర్కొన్నారు. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోందని, దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు ప్రభుత్వం అందించిందని, ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుందని వెల్లడించారు.
సిఎం చంద్రబాబు పర్యటన ఇలా..
చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10:50 గంటలకు చేరుకుంటారు. 11:05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కొత్తపేటలో 04:10 గంటలకు టిడిని శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04:45 గంటలకు సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.







కామెంట్‌లు (0)