ఉదయం 6 గంటలు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మంగమ్మ ఇంటి ముందు నుంచి దీనంగా ఏడుపు వినిపించింది. ‘ఏమ్మా మంగమ్మ! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?’ అంటూ పక్కింటి సుబ్బారావు పరుగెత్తుకుంటూ వచ్చాడు. కళ్ల నీళ్లతో మంగమ్మ వణుకుతూ, ‘అయ్యా... మా అబ్బాయి రాజును ఏదో పాము కరిచిందయ్యా! కాలికి రెండు పళ్ల గుర్తులు ఉన్నాయి. “నొప్పి... నొప్పి...” అంటూ పొర్లాడుతున్నాడు’ అని చెప్పింది. ‘మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావ్?’ అని సుబ్బారావు ఆదుర్దాగా అడిగాడు. మంగమ్మ చీరకొంగుతో కళ్లను తుడుచుకుంటూ, ‘ఊరి చివర పెద్దయ్యగారు ఉన్నారు కదా! ఆయన పాము కాటుకు మంత్రం వేస్తారంట. ఆయన దగ్గరికే తీసుకెళ్తున్నాను’ అని చెప్పింది. సుబ్బారావు ఆశ్చర్యపోతూ, ‘అదేంటి మంగమ్మ! 2026 వచ్చింది. ఇంకా మంత్రాలా? మంత్రాలకు చింతకాయలు రాలవు’ అని అన్నాడు. అప్పుడు మంగమ్మ కోపంగా, ‘అలా అనకు అయ్యా! మొన్న భూషయ్య కొడుకుని పాము కరిచింది. పెద్దయ్యగారు మూడుసార్లు ఊది, మంత్రజలం చల్లారు. పిల్లాడు లేచి ఆడుకున్నాడు. అందుకే నాకు నమ్మకం’ అంది. తాను ఎంత చెప్పినా మంగమ్మ అర్థం చేసుకోలేదని భావించిన సుబ్బారావు కాస్త స్వరం పెంచి, ‘చూడు మంగమ్మ. భూషయ్య కొడుకును కరిచింది విషం లేని పాము అయ్యుండొచ్చు. అందుకే బతికాడు. కానీ అన్ని పాములు అలా ఉండవు. ప్రమాదకరమైన పాము కరిస్తే వెంటనే చికిత్స చేయాలి. మంత్రం విషాన్ని ఆపదు తల్లి. మనం మీ అబ్బాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం, పదా!’ అన్నాడు.
ఈసారి మంగమ్మ సుబ్బారావు మాటలు నమ్మింది. కొడుకుని గుండెలకు హత్తుకుని అతని బైక్ ఎక్కింది. పది నిమిషాల్లో వాళ్లు ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ వెంటనే పరీక్ష చేసి, అవసరమైన చికిత్స ప్రారంభించి ఇంజెక్షన్ ఇచ్చారు. రెండు గంటల తర్వాత రాజు, ‘అమ్మా... ఆకలేస్తుంది’ అన్నాడు. ఆ మాట వినగానే మంగమ్మ సుబ్బారావుకు దండం పెట్టింది. ‘అయ్యా! ఈరోజు నువ్వు నా బిడ్డ ప్రాణం కాపాడావు. ఇంకెప్పుడూ మంత్రాల మాయలో పడను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు నవ్వుతూ, ‘మూఢనమ్మకాలు చంపుతాయి మంగమ్మ. సైన్స్ బతికిస్తుంది. ఇది గుర్తుంచుకో’ అన్నాడు.
నీతి: పాము కాటు పడితే మంత్రం కాదు, వెంటనే ఆసుపత్రికి వెళ్లడమే సరైన చికిత్స.
– యం. రాం ప్రదీప్
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు
94927 12836






కామెంట్‌లు (0)