శుక్రవారం, 07 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఢిల్లీ డేంజరస్‌.. బీ కేర్‌ఫుల్‌..

1 గంట క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 05:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఈ మాటలన్నదెవరో తెలుసుకునే ముందు అసలు ఢిల్లీ అంటే ఏంటో తెలుసుకోవాలి. వందల ఏళ్లుగా ఈ దేశ భవిష్యత్తులో కీలక నగరంగా ఉన్న రాజధాని ప్రదేశం. ఇప్పుడీ దేశానికి అధినేత ప్రధాని నరేంద్ర మోడీ. మరి ఆయనే ఢిల్లీ డేంజర్‌ గురించి హెచ్చరించడం వింత కదా? కానీ నిజమే. అది కూడా అలా ఇలా కాదు. ఇప్పుడాయన బొద్దింకల యుద్ధం దెబ్బకు తలకిందులైపోతున్నారు. పార్లమెంటులో నిలదీస్తున్న ప్రతిపక్షాల తాకిడి తట్టుకోలేక మొహం చాటేస్తున్నారు. కానీ బయట నుంచి మాత్రం సూక్తులూ, సుభాషితాలు గుమ్మరిస్తూనే ఉన్నారు. నోట్ల రద్దు నుంచి నేటి వరకు ఎప్పుడూ సమస్య వచ్చినా సభ బయట తప్ప లోపల మాట్లాడకపోవడం ఆయనకు అలవాటైన మంత్రం. ఇప్పుడు కూడా అదే పద్ధతి షరా మామూలే! కాకుంటే ఈ లోటు తీరడానికి మధ్య మధ్యలో ఎంపీలకు విందుల ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని మళ్లీ బ్యాక్‌ఫీడ్‌ మాటలు చెప్పి పంపించేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ముచ్చట్లలో తన నిద్ర అలవాట్లు వంటివి ప్రస్తా వించారు. అంతా అయ్యాక ఢిల్లీ సంగతి తీశారు. ‘‘ఇది చాలా ప్రమాదకరమైన చోటు. మీరు ఎవరిని కలుస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏది ఎలా లీక్‌ చేస్తారో తెలియదు. తర్వాత హఠాత్తుగా చిక్కుకుపోతారు. అంతా తలకిందులైపోతుంది’’ అని హెచ్చరించారట. మరెవరు ఏం చేసినా మోడీజీ కాపాడతాడని భరోసాగా ఉండే వాళ్లకు ఆయనే ఇంత వార్నింగ్‌ ఇచ్చిపంపారంటే పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదూ? విశ్వగురుడిని అభద్రత ఆవరించిం దన్నమాటే, కాదంటారా? దేశాధినేత అంత జాగ్రత్త పడుతుంటే ఇక చోటా మోటా మనుషుల సంగతేంటి? వారికి రక్షణేంటి? పెగాసిస్‌లు తెచ్చి మరీ నిఘా వేసే ఏలిన వారి మహిమల నుంచి, మాఫియాల నుంచి రక్షించుకోవడమేంటి? కాబట్టి మనమూ కేర్‌ఫుల్లే..

త్రేతాయుగ డ్రస్‌ స్టోర్‌ ఎక్కడ?

తప్పులు పట్టాలనుకుంటే దేనిలోనైనా ఎన్నయినా లొసుగులు తీయొచ్చు. లోపాలు ఎంచొచ్చు. అందులోనూ అయినదానికి కానిదానికి వివాదాలు పెట్టి విద్వేషాలు రగిలించాలనే మతతత్వ శక్తులు పొంచి కూచున్నప్పుడు ఏదో ఒకటి దొరక్కపోదు. ఎన్టీఆర్‌ వంటివారి పుణ్యాన తెలుగువారికి పౌరాణిక చిత్రాల లోటు లేదు. ఇతర భాషల్లో అంతటి ప్రాచుర్యం లేదు. డీడీ, అంటే దూరదర్శన్‌ వచ్చాక రామాయణ, భారతాలు భారీ ధారావాహికలుగా వెలువడి ప్రజలపై బాగానే ప్రభావం చూపాయి. ఇప్పుడైతే వందల కోట్ల ఖర్చుతో కాల్పనిక పౌరాణికాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామాయణ వస్తున్నది. కొంతకాలం కిందట హడలగొట్టిన ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లా కాకుండా ఇది కళాత్మకంగా తీశామంటున్నారు నిర్మాతలు, దర్శకులు. రణవీర్‌, సాయిపల్లవి, యష్‌లు కీలక పాత్రధారులు. అంతవరకూ బాగానే ఉంది. దీనికి 5,000 కోట్లు ఖర్చు చేశారట. అంతా అయి ఇప్పుడు విడుదల చేయాలనుకుని నెమ్మదిగా ప్రమోషన్‌ కోసం దృశ్యాలు, చిత్రాలు, టీజర్లు వదులుతున్నారు. ఈ బొమ్మల్లో కైకేయిని చూసి రెచ్చిపోతున్నారు పరివారులు. ఆమె కట్టుకున్న చీర, రవిక నవీన కాలాన్ని తలపిస్తుండటం రామాయణాన్ని అవమానించడమేనట. తమ ఆమోదం లేకుండా విడుదల చేయకూడదట. ఈ సమయంలో కాస్ట్యూమ్‌ దర్శకులైన రింపుల్‌, హర్‌ప్రీత్‌లు గట్టి సమాధానమే ఇచ్చారు. అసలు రామాయణ కాలంలో వస్త్రధారణ ఎలా ఉందో ఎవరు చూశారు? త్రేతాయుగం గుర్తులేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. పాత్రలు, వాటి ఉద్వేగాలు చూడాలి గానీ లేనిపోని వివాదాలు తేవద్దని కోరారు. వీటిపై తగాదాలు పెంచడం నిరర్థక వ్యవహారం. ఇంతకూ ఈ దర్శకులు చెప్పిన పరమ రహస్యం ఏమంటే, పురాణ పాత్రలను కూడా మన నేటి అవగాహన, ఆలోచనల ప్రకారమే ఊహించుకోగలం తప్ప మనకు తెలియని కాలంలో కాదు. శ్యాం బెనగల్‌ డీడీ కోసం తీసిన భారతంలో దుస్తులు చూస్తే వీరేమంటారో? మన వాళ్లు చూపించే నమూనా దుస్తులు గ్రీకుల కథల మేళవింపే తప్ప కేవలం పురాణాల్లోది కాదు. ఇంతకూ పౌరాణికాల కోసం, చారిత్రకాల కోసం కావ్యాలు చదవడం, శిల్పాలు, చిత్రాలు చూసి రూపొందించుకోవడం తప్ప ఇదమిత్థంగా ఇదేనని శాసనాలుండవు. ఎన్టీఆర్‌ ఒక్కో పురాణ పాత్రకు ఒక్కో విధమైన కిరీటం వాడతారు. రాముడికి వేరు, కృష్ణుడికి వేరు. కృష్ణుడు కూడా రేపల్లెలో వేరు, ద్వారకలో వేరు. కావాలని చేసేవారికి అంత లోతైన వివరాలు ఎందుకు? వివాదమే ముఖ్యం.

పీపీపీ.. ప్పిప్పిప్పి.. కొసమెరుపు

మన రాజకీయాలు, మీడియా కథనాలు ఎంత హాస్యాస్పదంగా తయారయ్యాయంటే అటూ ఇటూ తిప్పి తిప్పి చెప్పడం ద్వారా నిజాన్ని కప్పిపుచ్చడమే ఏకైక సూత్రంగా ఉంటుంది. భోగాపురం విమానాశ్రయమే తీసుకోండి. దాని అధినేత జీఎంఆర్‌ అనే గ్రంధి మల్లికార్జునరావు. భూమి ఇచ్చి ఉపాధి పొందలేకపోయిన వారు, పరిహారం కోసం చూస్తున్న వారు రైతులు. ఇక కట్టడానికి కావలసిన వేల కోట్లు అందించింది ప్రజల సొమ్ముకు కాపలాదార్లుగా ఉండవలసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. అయినా సరే ఆ విమానాశ్రయం క్రెడిట్‌ మాదంటే మాదని కుస్తీలు నవ్వు తెప్పిస్తాయి.

ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూడండి. భారీగా వచ్చిన లేదా తెచ్చిన జన సందోహం తిరిగి వెళ్లేప్పుడు చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారని కొన్ని కథనాలు, కామెంట్లు. వారు చేసిన నేరమల్లా అక్కడక్కడా మొక్కలు పీక్కోవడం, జలాశయాల్లో ఆడుకోవడం... పీపీపీ నమూనాలో పి పేరుకే గానీ ప్రజలకు ఏ హక్కూ ఉండదని తెలియదా అని ఈ కామెంట్ల సారాంశం.

బాబుగారేమో తన శ్వేతపత్రంలో పీపీపీనే మోక్షమార్గమని పొగిడి పరవశించారు. ఈ జాబితాలో కొసమెరుపు ఇంకోటుంది. ఏపీకి వచ్చిన లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయనేది నిజం కాదన్నట్టు కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే వచ్చాయని రాజ్యసభలో కేంద్రం చెప్పింది. చర్చ జరిగింది కూడా. కూటమి పెద్దలకు ఇదేం నచ్చలేదు. దాంతో ఈసారి కాస్త మార్చి పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయని మరో సమాధానం తెప్పించారు. కాకుంటే పెరిగిన రెట్లు ఎన్నైనా, వచ్చిన పెట్టుబడి మాత్రం ఐదు వేల కోట్లకే తగ్గిపోయింది... బాగైందా?

-పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్