శుక్రవారం, 07 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకృష్ణా డెల్టాను వేధిస్తున్న సాగునీటి కొరత

56 నిమిషాల క్రితం

paddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • గోదావరి నుంచి లక్షల క్యూసెక్కులు కడలిపాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీరు గత పది రోజులుగా సముద్రం పాలవుతుండగా కృష్ణా డెల్టాకు మాత్రం నీటి ఎద్దడి కొనసాగుతుంది. గోదావరి ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా రావడంతో గరిష్టంగా పది లక్షల క్యూసెక్కుల వరకు సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 3.37 లక్షల క్యూసెక్కుల వరకు కాటన్‌ ‌బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కూడా పూర్తిస్థాయిలో నీరు ఇవ్వడం లేదు. గత రెండు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి 6,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతకు ముందు 5400 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేశారు. మొత్తంగా ఈ ఏడాది ఎల్‌‌నినో అంశాన్ని పరిగణలోకి తీసుకుని వరిసాగును నిరుత్సాహ పరచాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా అటు గోదావరి డెల్టా, ఇటు కృష్ణా డెల్టాలో ఇప్పటి వరకు వరి సాగు మందగమనంగానే సాగుతోంది.

రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మొత్తం 38 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 14 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 3.10 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి లో రెండు లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1.75 లక్షల ఎకరాలు, నెల్లూరులో 1.80 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 1.50 లక్షల ఎకరాలు, ఏలూరు, తిరుపతి జిల్లాలో లక్ష ఎకరాలు చొప్పున సాగైంది. కాకినాడ జిల్లాలో 85 వేల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 80 వేల ఎకరాల్లో సాగు చేయగా గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, బాపట్ల జిల్లాలో 40 వేల ఎకరాలు, ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లాలో 30 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఇతర జిల్లాల్లో మరో మూడు లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కృష్ణా డెల్టా పరిధిలో ఈ ఏడాది తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా ఉండగా ఇప్పటి వరకు కేవలం మూడు లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఇంకా దాదాపు ఆరు ఎకరాల్లో సాగుకు నీటి ఎద్దడి కొనసాగుతోంది. పట్టిసీమ ద్వారా వస్తున్న నీటితో కృష్ణా, ఎన్‌‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోనే పరిమిత స్థాయిలో జరుగుతోంది. కృష్ణా బేసిన్‌‌లో ఎగువ ప్రాంతంలో వర్షాలు మెరుగ్గా ఉండటం వల్ల ఎగువ ప్రాంతంలోని జలాశయాలు నిండి శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలంకు గురువారం 2.31 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం జలాశయం నిల్వ సామర్ధ్యం 215.81 టిఎంసిలు కాగా ఇప్పటి వరకు 138.27 టిఎంసిల నీటి నిల్వ ఉంది. సాగర్‌‌లో 312.05 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యం ఉండగా గురువారం 137.34 టిఎంసిలు, పులిచింతలలో 45.77 టిఎంసిలకు గాను 28.87 టిఎంసిలు నీటి నిల్వ ఉంది. తుంగభద్రలో గరిష్ట నీటి నిల్వ 105.79 టిఎంసిలు కాగా ప్రస్తుతం 64.81 టిఎంసిల నిల్వ ఉంది. కృష్ణా బేసిన్‌ ‌లో అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు 50 శాతంకు పైగా ఉన్నా వరి సాగుకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుంది. 2003లో సాగర్‌ జలాశయంలో డెడ్‌ ‌స్టోరేజీకి చేరినా కృష్ణా డెల్టాలో వరి సాగుకు నీరు ఇచ్చిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సగటు వర్షపాతం 49.08 శాతం లోటు ఉండటం వల్ల కేవలం జలాశయాలపై ఆధారపడి వరికి అనుమతి ఇవ్వలేమని సాధారణ వర్షపాతం 80 శాతంపైగా ఉండి, జలాశయాల్లో నీటి నిల్వలు 90 శాతం ఉంటే వరికి అనుమతి ఇవ్వవచ్చునని జలవనరుల శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్