"పదేళ్ల వరకు ప్రెబుత్వానికి రూపాయి రాబడి రానప్పుడు, ముప్పయి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత సంబరం సెయ్యడం అవసరమా?"
"సాక్షాత్తు దేశానికి రాజే వొచ్చిన తర్వాత, సామంత రాజు అప్పు జేసైనా గొప్పరికం సూపించుకోవాలా! పరపతి పెరగాలంటే ఆ లెవెల్లో పులి వేషం వుండాల. తప్పదు మరి!"
"మధ్యలోన మన పులి ఏడుపేటన్నా?" - భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపినింగ్ తరువాత, నారాయణ మూర్తి, బుస్సీ నాయుడు, దశుమంతు నాయుడు కలిసి భీమిలి రాజు గారి రిసార్ట్‌లో సేదతీరడానికి వచ్చేశారు.
"ఒరేయ్! పులి ఏడుపు అంటే, మీ ప్రాంతంలో ఏమంటారో గానీ, మావోళ్లు మాత్రం దొంగేడుపు అంటార్రా! ఏమండీ?" - విజయవాడ నుంచి వచ్చిన మిత్రుడు మొహం చూసి నవ్వుతూ అన్నాడు మూర్తి.
"ఎంత మాటనీశారండీ! ఏడుపొకటే తక్కువగానీ, అంతమందిలోనూ, ఆ మాటన్నప్పుడు ఆ మొహంలో ఫీలింగ్స్ చూశారా! పులి ఏడుపు మొహం పెట్టినట్లు లేదూ?" - పరదేశి నొచ్చుకున్నాడు.
"దేనికిరా! ఏడుపు? నీట్ పరీక్ష పేపరు లీకైనప్పుడు, ఎన్నో ఆశలతో పరీక్షలు రాసిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఒక్క కన్నీటి చుక్క కార్చాడా మీ వాడు?కోచింగులకు వాళ్ల తల్లిదండ్రులు ఎంత సొమ్ము ధారపోశారో మాకు తెలుసు. వాళ్ల కడుపు మంట ఎవరికి తెలుస్తుంది? సినిమాల్లోనే సరిగ్గా ఏడవలేడు మీవాడు! మోడీ దగ్గర మెహర్బానీకి గానీ, ఎవడు నమ్ముతాడు ఆ పులి ఏడుపు?" - మూర్తి మాటల్లో కొంచెం కరకుదనం కదిలింది.
"ఆ లీకేజీల మంత్రిని రాజీనామా చేయించండి అని అడిగారు విద్యార్థులు. తప్పేముంది? ఒక్క సంతకానికి అంత రక్తం వచ్చేటట్టు కొట్టాలా? అప్పుడు ఏడుపు రాలేదా మీవాడికి?" - విజయవాడ నుంచి వచ్చిన మూర్తి మిత్రుడు కూడా గొంతు జత చేశాడు.
"అంతెందుకండీ! గవర్నమెంట్ హాస్టల్లో గిరిజన పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. భోజనాలు బాగోలేక హాస్పిటల్ పాలవుతున్నారు. ఆళ్ల బాధల్ని సక్క దిద్దకుండా, బలవంతంగా బస్సులెక్కించేసి, ఆ పిల్లలతోనే దింసా డాన్స్ చేయించడం సబబుగా లేదు. అరుకు ఏజెన్సీ కెళ్ళి, మామిడి పళ్ళు, చెప్పులు, బట్టలు ఇచ్చీసి, అక్కడ పకపకలు, ఇక ఇకలూ కాదు. డోలీల్లో గర్భిణీ స్త్రీలను తీసుకొస్తుంటారు. తల్లి చస్తాదో.. పిల్ల చస్తాదో తెలీదు. అలాంటి విషయాలు తెల్సినప్పుడు, మనిషి అన్నోడికి కన్నీరు వస్తాది. మంత్రి అన్నోడు ఏడిస్తేనే గొప్ప! మోడీకి తిట్టారని ఈయనకు ఏడుపొచ్చిందట! నమ్మడానికి మనమేమైనా భోగాపురం రైతులమేటీ!" - దశమంతు నాయుడు కూడా తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశాడు. పరదేశి ఊహించలేదు.
"అన్నా! నువ్వు కూడా పార్టీ మార్చేసినావేటి?" - అనుమానంగా మొహం చూసాడు. అతని స్పందన కోసం ఎదురు చూడకుండా, "సెలవు లేకుండా మోడీ కష్టపడుతుంటే, తిట్టారనే మావోడి బాధ!" అన్నాడు.
"పదవుల్లో ఉన్నోళ్లకి సెలవులేంటయ్యా! అవేమీ ఉద్యోగాలా? అబద్ధమాడితే అతికినట్టుండాలి." — కోపమయ్యాడు మూర్తి. మూర్తితోపాటు విజయవాడ నుంచి వచ్చిన బృందమంతా చంద్రబాబు అభిమానులు. మోడీ దగ్గర మార్కులు కొట్టేయడానికి, పవన్ కళ్యాణ్ ట్రాజెడీ నటించాడని వాళ్లకి ఉక్రోషం. ఆ విషయం గ్రహించి, వాళ్లతో అవసరాలు గుర్తుచేసుకొని నాయుడు వాళ్ల వాదనకు మద్దతు పలికాడు. ఆ విషయం తెలియని పరదేశి,
"ఏమైనా, మగోడి ఏడుపు మంచిది కాదండి!" - వాళ్ల మొహం చూడకుండా వెనక్కి తిరిగాడు.
"ఏమైపోతుంది? ఎల్ నినో వెనక్కి పోతుందా?" - వెటకారంగా అన్నాడు మూర్తి మిత్రుడు. సర్రున కోపమొచ్చేసింది పరదేశికి.
"నిండు సభలో చంద్రబాబు ఏడిస్తే, జగన్ ఏటైపోయాడు? ఎలక్షన్లో అసెంబ్లీలో కూచోగలిగాడా! అందువల్ల మొగోడు ఏడుపు మంచిది కాదు." పైకి లేచి, బయటకు వెళ్లిపోయాడు పరదేశి.
అంతా వింటున్న రిసార్టు బోయ్ ప్లేట్లు సర్దుతూ, చిన్నగా నవ్వి, "మా ఏరియాలో ఒక సామెత ఉందండి బాబూ! అదేటంటే.. ఏడ్సిన మగోడ్ని నమ్మకూడదని!" - ప్లేట్లు పట్టుకొని బయటికి పోయాడు. ఆ మాట పరదేశికి వినపడలేదు. మూర్తి మిత్రుడు మాత్రం, పకా పకా నవ్వుతూ, "మేము అన్నది కూడా అదే కదండీ! పులి ఏడుపు!" - గదినిండా నవ్వులు.
పరదేశి చెవుల పడగానే, ఉక్రోషంతో కొంచెం కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
- 'నల్లి' కుట్టు







కామెంట్‌లు (0)