శుక్రవారం, 07 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'జంతర్‌ మంతర్‌' విజయం- తర్వాత ...

54 నిమిషాల క్రితం

Jantar Mantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 05:49 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

అత్యున్నత న్యాయస్థానం నుంచి 'బొద్దింకలు' అన్న ఈసడింపును ఎదుర్కొన్న దేశ యువత దానికి ప్రతిస్పందిస్తూ జూన్‌, జులై మాసాల్లో సాగించిన పోరాటం అద్వితీయం. ఆ పోరాటం సాధించినదేమిటి? దాని ప్రభావం దేశంపై ఏయే విధాలుగా పడింది, పడనుంది? రానున్న రోజుల్లో యువజనులు మరింత క్రియాశీలంగా పాల్గొనవలసిన ఆవశ్యకత, అవకాశాలు, ఉద్యమం ఏ దిశలో సాగాలి వంటి అనేక అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తిరుగే లేదన్న దురభిప్రాయం ఈ పోరాటంతో పటాపంచలైంది. కాక్రోచ్ లు 'గోదీ మీడియా' స్వభావాన్ని బట్టబయలు చేశాయి. అబద్ధాల పునాదుల మీద నిర్మితమై, విద్వేషాన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకుని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుపైనా బురదజల్లే ఎదురుదాడి వ్యూహం ఒక్కసారిగా చతికిలబడింది. బిజెపి–ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వపు కార్పొరేట్‌ సేవాతత్పరత, సామ్రాజ్యవాదం ముందు వెన్నెముక లేనట్టుగా సాగిలబడి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే సిగ్గుమాలిన వైఖరి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర వ్యవస్థలను లోబర్చుకుని జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న తీరు, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న విధానం- ఒక్క మాటలో చెప్పాలంటే దాని నయా ఫాసిస్టు స్వభావం- ప్రజల కళ్లకు కట్టినట్లు సోషల్‌ మీడియాలో వెల్లడైంది.

ధర్మేంద్ర ప్రధాన్‌ తన రాజీనామా లేఖలో దేశద్రోహకర శక్తులు ఉద్యమంలో చొరబడ్డాయని, వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికే తాను పదవి వదిలేశానని చెప్పుకున్నాడు. కానీ రాజీనామా చేసిన మరుసటి రోజే పార్లమెంటులో పాలక కూటమి సభ్యులు అతడికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. అతడి సొంత రాష్ట్రం ఒడిశాలోనూ అదే దృశ్యం కనిపించింది. అతడి స్థానంలో నియమితుడైన ప్రహ్లాద్‌ జోషి చరిత్ర కూడా కళంకితమే! ప్రధాని మోదీ అర్ధరాత్రి ప్రసంగం బిజెపి నయవంచనకు, కపటత్వానికి మచ్చుతునకగా నిలిచింది. తన పాలనలోని అవకతవకలకు బలైన యువతకు, జంతర్‌ మంతర్‌ వద్ద పోలీసుల రాక్షసత్వానికి గురైన వారికి క్షమాపణలు చెప్పాల్సిన మోదీ, తానే ఆందోళనకారులను ''చాలా ఉదారంగా, పెద్ద మనస్సుతో'' క్షమించేస్తున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వేధింపులకు గురిచేయడం మొదలైంది. గతంలో నిరాధారంగా బనాయించిన కేసులను తిరగదోడి అరెస్టులకు సిద్ధమవుతున్నారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై చట్టవిరుద్ధంగా దాడికి పూనుకుని ఢిల్లీ పోలీసులు భంగపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించినా, మోడీ ప్రభుత్వం తన వైఖరిని, విధానాలను సవరించుకోవడానికి గానీ, తప్పులను అంగీకరించి దిద్దుకోవడానికి గానీ సిద్ధంగా లేదని, పైగా ఎదురుదాడులు, కక్షపూరిత చర్యలకే పూనుకుంటోందని ఇది స్పష్టం చేసింది.

ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రజాస్వామికవాదులందరికీ ఉత్సాహాన్ని, ప్రేరణను, భవిష్యత్తుపై విశ్వాసాన్ని కలిగించిన జంతర్‌ మంతర్‌ ఉద్యమానికి, యువజనులకు తోడుగా నిలవడం మన మొదటి కర్తవ్యం. విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలతో రెచ్చిపోతున్న గోదీ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విద్యార్థి, యువజనులకు అండగా నిలవాలి. ఒక్కొక్కరిని విడదీసి మోదీ ప్రభుత్వం సాగిస్తున్న నిర్బంధకాండను ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రతిఘటించాలి. ఈ ఆందోళనను మెచ్చుకుంటూనే కొందరు విశ్లేషకులు అనేక సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ఆందోళనకారుల శక్తిసామర్థ్యాలను, ఉద్యమ సారధ్యాన్ని, లక్ష్యాలను, పరిమితులను ప్రశ్నిస్తున్నారు. 1974 నాటి జేపీ ఉద్యమంతో, 21వ శతాబ్దంలో సాగిన అన్నా హజారే 'లోక్‌పాల్‌' ఉద్యమంతో పోల్చుతున్నారు. ఈ కోణాలన్నీ చర్చించదగ్గవే. కానీ వాటన్నింటికంటే ముందు మనం ఆలోచించవలసిన అంశం మరొకటి ఉంది.

1990 దశకం నుంచి దేశంలో నయా ఉదారవాద విధానాలు అమలవుతున్నాయి. దాదాపు సమాంతరంగానే హిందూత్వ రాజకీయాలు ముందుకొచ్చాయి. 1980 నుంచి 2010 దశకాల మధ్య జన్మించిన తరంలోని అత్యధికులు ఈ విధానాలకు, విద్వేష రాజకీయాలకు లక్ష్యంగా మారారు. ఇదొక పోటీ ప్రపంచమని నమ్మి, ఆ పోటీలో నెగ్గడానికి సర్వస్వం ఒడ్డారు. విదేశీ చదువులు, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌, యూపీఎస్‌సీ ఇతర ఉద్యోగాల కోసం, ఇంకొందరు ప్రధాన నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం శ్రమించారు. ఫలితంగా వారిలో అత్యధికులు రాజకీయ రాహిత్యానికి లోనయ్యారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు అసలు కారణాలేమిటో గ్రహించే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోయారు. ఈఎంఐల ఉచ్చుల్లో చిక్కుకుని గిలగిలలాడుతున్నారు. ప్రభుత్వ విధానాల పర్యవసానాలు అర్థమవుతున్నా వాటిని ప్రతిఘటించే స్థాయిలో సంఘటితం కాలేకపోతున్నారు. అందుకు అవసరమైన ధైర్యం కూడా వారిలో తగ్గిపోయింది. ఈ తరాన్ని ఆ స్థితికి చేర్చడంలో హిందూత్వ- నయా ఉదారవాద విధానాల పాత్ర ఎంత ముఖ్యమో, వారి తల్లిదండ్రుల తరం పోషించిన పాత్ర కూడా అంతే ముఖ్యమైనది.

కానీ జంతర్‌ మంతర్‌ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినవారు ఆ తర్వాతి తరానికి చెందినవారు. అంటే 2000 తర్వాత తరం. వారి మీద కూడా హిందూత్వ–కార్పొరేట్‌ భావజాలం, విదేశీ వ్యామోహం ప్రభావం చూపేందుకు ప్రయత్నించాయి; ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పాలక వర్గాలు కళ్లకు కట్టిన గంతలను ఈ తరం విప్పేసుకుంటోంది. వాస్తవ ప్రపంచాన్ని చూడగలుగుతోంది. చుట్టూ అలముకున్న అంధకారం నుంచి బయటపడి కొత్త వెలుగుల వైపు నడవడానికి ప్రయత్నిస్తోంది. రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుంటోంది. ప్రశ్నించడం అలవర్చుకుంటోంది. సంఘటితం కావడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాథమిక దశలోనే మోదీ ప్రభుత్వంపై సాధించిన విజయం దేశవ్యాప్తంగా భయంతో ముడుచుకుపోయిన మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు కొత్త ప్రేరణను ఇచ్చింది. ఈ నవతరానికి ఇప్పుడు కావలసింది మన దిశానిర్దేశం కంటే ముందుగా మన అండ. వాళ్లు మనవైపు చూసేలా చేయడం కాదు, వారి వైపు మనమే మరింత శ్రద్ధగా, బాధ్యతగా చూడాలి. భావజాల రంగంలో గోదీ మీడియా ప్రభావాన్ని తాత్కాలికంగానైనా పటాపంచలు చేయగలిగిన వారి శక్తిని, అందులో నిబిడీకృతమై ఉన్న భవిష్యత్తును గుర్తించి, ప్రజాస్వామ్య శక్తులన్నీ వారికి అండగా నిలవాలి.

1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం మన దేశంపైనా తీవ్ర ప్రభావం చూపింది. దానికి దేశీయ విధానాలు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సంక్షోభ భారాన్ని ప్రజలపైకి నెట్టి, పాలక వర్గాల ప్రయోజనాలను కాపాడే దిశగా అడుగులు వేసింది. రూపాయి విలువ తగ్గింపు, వేతన స్తంభన వంటి విధానాలు ధరల పెరుగుదలకు దారితీశాయి. కార్మిక సమ్మెలను ఉక్కుపాదంతో అణచివేశారు. 1974 రైల్వే సమ్మెపై సాగిన దమనకాండ అప్పటి పాలకుల వైఖరికి అద్దం పట్టింది. పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ప్రతిస్పందనగా జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వంలో 'సంపూర్ణ విప్లవం' నినాదంతో ఉద్యమం తలెత్తింది. రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో సాగిన ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది. కానీ 19 నెలల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ కాంగ్రెస్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని మళ్లీ బలోపేతం చేశారు.

1990 దశకంలో ప్రారంభమైన నయా ఉదారవాద విధానాలు దాదాపు రెండు దశాబ్దాలపాటు అమలై దేశంలో అసమానతలను, పేదరికాన్ని విపరీతంగా పెంచాయి. కనీస వేతనాలకు నోచుకోని అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగింది. వ్యవసాయ రంగంలో ఈ విధానాలు సృష్టించిన సంక్షోభం లక్షలాది రైతుల ఆత్మహత్యలకు దారితీసింది. అదే కాలంలో బాబరీ మసీదు విధ్వంసం అనంతరం హిందూత్వ మత విద్వేష రాజకీయాల జోరు పెరిగింది. ఈ సవాళ్లను ఎదుర్కొని ప్రజలను సమీకరించే బాధ్యత ప్రజాస్వామిక శక్తుల ముందుకొచ్చింది. ఇదే సమయంలో అవినీతిని ప్రధాన అంశంగా తీసుకుని అన్నా హజారే ఉద్యమాన్ని ప్రారంభించాడు. దేశంలోని అన్ని సమస్యలకూ అవినీతే మూలకారణమన్న వాదనను, రాజకీయాలకు అతీతంగా పోరాడాలన్న భావనను ముందుకు తెచ్చాడు. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తి ఆ ఉద్యమం వైపు మళ్లింది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో అవినీతి వ్యవస్థాగత స్వభావాన్ని పక్కనబెట్టి, లోక్‌పాల్‌ ఏర్పాటు ఒక్కటితో అవినీతిని నిర్మూలించవచ్చన్న భ్రమను ఆ ఉద్యమం కల్పించింది. ఫలితంగా సామాజిక న్యాయం, లౌకికవాదం వంటి మౌలిక అంశాలు వెనుకబడిపోయాయి.

ఈ రెండు ఉద్యమాలకు భిన్నంగా జంతర్‌ మంతర్‌ యువత ఉద్యమం రూపుదిద్దుకుంది. సోషల్‌ మీడియా నిరసనగా ప్రారంభమై, అనతికాలంలోనే ప్రత్యక్ష కార్యాచరణకు విస్తరించింది. సమగ్రమైన సిద్ధాంతం, వ్యూహం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోకపోయినా, హిందూత్వ శక్తుల విద్వేష రాజకీయాలను, కపటత్వాన్ని నేరుగా సవాలు చేసింది. లౌకిక విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కట్టింది. నయా ఉదారవాదం ముందుకు తెచ్చిన 'పోటీ ప్రపంచం' సిద్ధాంతాన్ని ప్రశ్నించింది. విద్యా వ్యాపారాన్ని బోనులో నిలబెట్టింది. నయా ఫాసిస్టు తరహా ప్రచారాన్ని సాగించిన గోదీ మీడియా ఈ నవ ప్రభంజనం ముందు పూర్తిగా తేలిపోయింది. 'కొమ్ములు తిరిగిన' నాయకులు లేకపోయినా, 'కొమ్ములు పొడుచుకొస్తున్న పోట్లగిత్తల మాదిరి' కార్యకర్తలు ముందుకొచ్చి పాశవిక నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. మోదీ ప్రభుత్వపు అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ వారి సంకల్పం ముందు నిర్వీర్యమయ్యాయి.

దేశంలో నిలకడగా, సమైక్యంగా పోరాడుతున్న రైతాంగం ఒక సమైక్య శక్తిగా ఎదుగుతోంది. ఆత్మహత్యల నిస్పృహను అధిగమించి ఉద్యమాల బాట పడుతోంది. దేశవ్యాప్తంగా కనీస వేతనాలు, లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం లక్షలాది అసంఘటిత కార్మికులు పోరాడుతున్నారు. ఈ పోరాటాల్లోనూ యువజనులే ప్రధాన భాగస్వాములు. ఆర్థికంగా మాత్రమే కాదు, సామాజికంగానూ అణచివేతకు గురవుతున్న వర్గాలే ఈ ఉద్యమాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఈ ప్రధాన శక్తుల పోరాటాలు మరింత విస్తరించి, బలపడాలి. విద్యార్థి, యువజనుల ఉద్యమం కూడా వాటితో సమాంతరంగా సాగాలి. అప్పుడే హిందూత్వ–కార్పొరేట్‌ శక్తుల పాలనకు నిజమైన ప్రత్యామ్నాయం రూపొందే ప్రాతిపదిక ఏర్పడుతుంది. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు, రాజ్యాంగ పరిరక్షణ వేదికలు, మానవ హక్కుల సంఘాలు, దళిత, గిరిజన, మహిళా హక్కుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, సాహిత్యకారులు, కళాకారులు ఈ ప్రత్యామ్నాయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఉద్యమాలతో మమేకమవుతూ, అవసరమైన దిశానిర్దేశం అందిస్తూ వామపక్ష శక్తులు ఇందులో కీలక భూమిక పోషించాలి.

బిజెపి నాయకత్వంలో సాగిన ఉద్యమాల్లోనూ, అన్నా హజారే ఉద్యమంలోనూ చొరబడి బిజెపి–ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నాయి. తామే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన శక్తులమంటూ ప్రతి జూన్‌ 26న గొప్పలు చెప్పుకుంటుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత బిజెపికి ప్రజా ఉద్యమాల అవసరం తీరిపోయింది. అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుంది. కార్పొరేట్‌ మీడియా అండ, బడా కార్పొరేట్ల మిలాఖత్‌ దానికి తోడయ్యాయి. అందుకే ఇప్పుడు ప్రజా ఉద్యమాలనే సహించలేకపోతోంది. 1974లోనూ, 2011లోనూ ప్రశంసించిన ఉద్యమాలనే నేడు దేశద్రోహుల కార్యకలాపాలుగా చిత్రీకరిస్తోంది. నియంతలు ప్రజలకు ఎంత దూరమవుతారో, అంతగా అభద్రతకు గురవుతారు. సమాజంలో చిన్న అలికిడి జరిగినా ఉలిక్కిపడతారు. 'దేశద్రోహం' అంటూ గగ్గోలు పెడతారు. ప్రతి చిన్న నిరసననూ దారుణంగా అణచివేయడానికి పూనుకుంటారు. మన రాష్ట్రంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఈ అణచివేతలన్నీ వారి పిరికితనాన్ని, బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే! ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రంగా ముదురుతోంది. మరోవైపు ప్రజలు ప్రశ్నించడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అలాంటి కారుచీకట్లలో మెరిసిన మెరుపులా జంతర్‌ మంతర్‌ ఉద్యమం ముందుకొచ్చింది. ఆ మెరుపు ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఆశను అందించింది. మీనమేషాలు లెక్కించకుండా ఈ నవతరపు చైతన్యాన్ని స్వాగతిస్తూ, దానికి అండగా నిలబడటమే నేటి చారిత్రక బాధ్యత.

-ఎం.వి.ఎస్. శర్మ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్