- ఆర్టిజిఎస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో వరద ముప్పును ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆర్టిజిఎస్ వెల్లడించింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అభివృద్ధి చేసిన ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ వ్యవస్థ పట్టణ వరద నియంత్రణలో కీలకంకానుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), ఐఐటీ గాంధీనగర్ నిపుణుల సహకారంతో ఈ వ్యవస్థను రూపొందించగా, కృత్రిమ మేధ, ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ, అంచనా విశ్లేషణ, జలవిజ్ఞాన నమూనాల ఆధారంగా పట్టణాల్లో వరద ముప్పును ముందుగానే అంచనా వేయనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రూపొందించిన అధిక స్పష్టత కలిగిన డిజిటల్ ఎలివేషన్ నమూనా ఈ వ్యవస్థకు కీలకంగా పనిచేస్తుందని వెల్లడించింది. విజయవాడ నగరానికి సంబంధించి గత 30 ఏళ్లలో నమోదైన వర్షపాతం, వరదలు, నగరంలోకి వచ్చిన నీటి పరిమాణం తదితర చారిత్రక సమాచారాన్ని డిజిటలీకరించి, దీని ఆధారంగా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, నీరు నిలిచిపోయే ప్రాంతాలను వార్డుల వారీగా గుర్తించి మ్యాపింగ్ చేసినట్లు పేర్కొంది. వరద ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ‘హాట్‌స్పాట్‌లు’గా గుర్తించినట్లు తెలిపింది. ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ వ్యవస్థ ద్వారా విజయవాడ నగరంలో ఆకస్మిక వరదల ముప్పును ఆరు గంటల ముందుగానే గుర్తించే అవకాశం ఉందని, అలాగే నగరంలో వర్షాలపై రెండు రోజుల ముందుగానే అంచనాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఆకస్మిక వరదలు వచ్చే పరిస్థితిని కృత్రిమ మేధ ఆధారంగా ముందుగానే అంచనా వేసి, ఏపీఎస్‌డీఎంఏకు సమాచారం చేరేలా వ్యవస్థను అనుసంధానించినట్లు పేర్కొంది. అక్కడి నుంచి విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం, వార్డు స్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు స్వయంచాలకంగా ముందస్తు హెచ్చరికలు చేరుతాయని తెలిపింది. దీంతో నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వెల్లడించింది.







కామెంట్‌లు (0)