- ఇద్దరు భారతీయులు గల్లంతు
కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయంలో ఇస్తాంబుల్ కేంద్రంగా పని చేసే ‘ఎంవి ఎజిఎన్ రాగ్నర్’ వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ డాడి చేసింది. ఈ నౌకలో నలుగురు భారతీయ పౌరులున్నారు. ఇందులోని ఇద్దరు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. ఈ ఘటనపై కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారని, మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియరాలేదని ఆదివారం సోషల్ మీడియాలో తెలిపింది. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. గత వారమూ నల్లసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ‘ఎంవి ఓమోర్ఫీ’ పేరుగల ఈ నౌకలో పది మంది సిబ్బంది ఉండగా, అందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ దాడిలో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. అయితే నల్లసముద్రంలో అతిపెద్ద నౌకాశ్రయమైన ఒడెస్సాలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. బ్లాక్ సీ ప్రాంతంలో నౌకల్లో ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. యుద్ధ ప్రభావిత జలాల్లో ఏవైనా ఉద్యోగాల్లో చేరేముందు ప్రమాదాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని భారతీయులకు, షిప్పింగ్ కంపెనీలకు సూచించింది.







కామెంట్‌లు (0)