- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొండకర్ల ఆవను ‘ప్రకృతి పరిరక్షణ ప్రాంతం’గా ప్రకటించేందుకు అవసరమైన నిరభ్యంతర ధృవీకరణ పత్రం జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపిందన్నారు. సాగునీరు, జలాశయ నిర్వహణ, జల వ్యవస్థలు, ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 950 చిత్తడి నేలలను గుర్తించామని, వాటిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తొలి దశలో 16 చిత్తడి నేలల ప్రకటనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణతో భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయని తెలిపారు. కొండకర్ల ఆవ అనేక రకాల వలస, స్థానిక పక్షులకు ఆవాసంగా ఉన్నందున, అక్కడ పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యావరణ పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తడి నేలలపై ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను సంబంధిత శాఖల సమన్వయంతో నిర్దిష్ట కాలవ్యవధిలో అధికారికంగా ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.







కామెంట్‌లు (0)