బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్ క్లీన్‌ స్వీప్

26 జులై, 2026

t20
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 08:32 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- మూడో టీ-20లోనూ జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం

- 3-0తో కప్‌ కైవసం

జింబాబ్వే పర్యటనను టీమ్‌ ఇండియా అద్భుత విజయంతో ముగించింది. వరుస ఓటములతో జింబాబ్వేకు వచ్చిన భారత్‌.. హ్యాట్రిక్‌ ‌విజయాలతో టి-20 సిరీస్‌‌ను 3-0తో క్లీన్‌‌స్వీప్‌ ‌చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (81) ధనాధన్‌ అర్ధ సెంచరీతో భారత్‌ ‌తొలుత 192/5 పరుగులు చేయగా.. బౌలర్లు సమిష్టిగా రాణించటంతో ఛేదనలో జింబాబ్వే 157/7 పరుగులే చేసింది. 35 పరుగుల తేడాతో భారత్‌ ‌ఘన విజయం సాధించింది.

హారారే : బ్రిటన్‌ ‌పర్యటనలో భారత్‌‌కు రిక్తహస్తమే మిగలగా.. జింబాబ్వే పర్యటనలో పరిపూర్ణ విజయం సొంతమైంది. హ్యాట్రిక్‌ ‌విజయాలతో హోరెత్తించిన శ్రేయస్‌‌సేన టి-20 సిరీస్‌‌ను 3-0తో క్లీన్‌‌స్వీప్‌ ‌చేసింది. బ్యాట్, బంతితో సమిష్టిగా రాణించిన భారత్‌ ‌మూడో టి-20లో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల ఛేదనలో ఆతిథ్య జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసింది. ర్యాన్‌ ‌బర్ల్‌ (54 ‌నాటౌట్‌, 43 బంతుల్లో 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్లలో మయాంక్‌ ‌యాదవ్‌ (3/29), యశ్‌ ‌ఠాకూర్‌ (2/45) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన భారత్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ (81, 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌‌లు) అర్ధ సెంచరీతో చెలరేగటంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఇషాన్‌ ‌కిషన్‌ (29, 26 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (27, 18 బంతుల్లో 2 ఫోర్లు), రింకు సింగ్‌ (25, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ‌రాణించారు.

సూర్యవంశీ దూకుడు

టాస్‌ ‌నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆరంభం కలిసి రాలేదు. విధ్వంసక ఓపెనర్‌ అభిషేక్‌ ‌శర్మ (2) ముచ్చటగా మూడో మ్యాచ్‌‌లో నిరాశపరిచాడు. అభిషేక్‌ అవుటైనా.. ఇషాన్‌ ‌కిషన్‌ (29) తోడుగా వైభవ్‌ ‌సూర్యవంశీ (81) దంచికొట్టాడు. ఇషాన్‌ ‌కిషన్‌ ‌మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 26 బంతుల్లో 4 ఫోర్లు బాదిన కిషన్‌ 29 పరుగులే చేశాడు. ఈ జోడీ రెండో వికెట్‌‌కు 50 బంతుల్లో 75 పరుగులు జోడించింది. కిషన్‌ అవుటైనా.. కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌ (27)తో కలిసి వైభవ్‌ ‌సూర్యవంశీ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. 29 బంతుల్లో 50 పరుగులు జోడించిన శ్రేయస్‌, సూర్యవంశీ భారత్‌‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. శ్రేయస్‌ అయ్యర్‌ ‌రెండు ఫోర్లతో మెరిసినా.. వికెట్‌ ‌నిలుపుకోలేదు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్యవంశీ సైతం నిష్క్రమించాడు. తిలక్‌ ‌వర్మ (11 నాటౌట్‌) ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. రింకు సింగ్‌ (25, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ‌ధనాధన్‌ ఇన్నింగ్స్‌‌తో మెప్పించాడు. 20 ఓవర్లలో 5 వికెట్లకు భారత్‌ 192 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ (2/41) రెండు వికెట్లు పడగొట్టాడు.

సమిష్టిగా మెరిసిన బౌలర్లు

ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లను భారత యువ బౌలర్లు మరోసారి చిత్తు చేశారు. ఇన్నింగ్స్‌ ‌తొలి బంతికే బ్రయాన్‌ ‌బెనెట్‌ (0) ‌వికెట్‌‌తో మయాంక్‌ ‌యాదవ్‌ అదిరే ఆరంభం అందించాడు. యశ్‌ ‌ఠాకూర్‌.. వరుస బంతుల్లో డియాన్‌ ‌మేయర్స్‌ (19, 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), సికందర్‌ ‌రజా (0)లను అవుట్‌ ‌చేసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఓ ఎండ్‌‌లో సహనంతో ఆడిన బెన్‌ ‌కరణ్‌ (20, 19 బంతుల్లో 2 ఫోర్లు)ను సైతం రవి బిష్ణోయ్‌ ‌సాగనంపాడు.

దీంతో 65/4తో జింబాబ్వే టాప్‌ ఆర్డర్‌ ‌కుదేలైంది. ఈ సమయంలో ర్యాన్‌ ‌బర్ల్‌ (54 నాటౌట్‌), వెస్లీ మాదవెరె (28, 25 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌‌లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వెస్లీని మయాంక్‌ ‌యాదవ్‌ అవుట్‌ ‌చేయగా.. మారుమణిని (1)ని అశోక్‌ ‌శర్మ సాగనంపాడు. దీంతో 134/6తో జింబాబ్వే ఓటమి కోరల్లో చిక్కుకుంది. కాసేపు ర్యాన్‌ ‌బర్ల్‌ ఒంటరి పోరాటం సాగించాడు. ఐదు ఫోర్లతో 42 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించినా.. అప్పటికే ఛేదనలో జింబాబ్వే ఓటమి ఖరారైంది.

​సంక్షిప్త స్కోరు వివరాలు :

భారత్‌ ఇన్నింగ్స్‌ : 192/5 (వైభవ్‌ సూర్యవంశీ 81, ఇషాన్‌ ‌కిషన్‌ 29, శ్రేయస్‌ అయ్యర్‌ 27, రింకు సింగ్‌ 25, బ్రాడ్‌ ఎవాన్స్‌ 2/41)

జింబాబ్వే ఇన్నింగ్స్‌ : 157/7 (ర్యాన్‌ ‌బర్ల్‌ 54, వెస్లీ 28, బెన్‌ ‌కరణ్‌ 20, మయాంక్‌ ‌యాదవ్‌ 3/29, యశ్‌ ‌ఠాకూర్‌ 2/45)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్