మత్స్యకారుల గల్లంతుపై సిఎం సమీక్ష
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్పకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయం అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జెట్టి నుంచి మత్య్సకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా, ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో విహెచ్‌ఎఫ్ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. అదేరోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని, దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. కోస్ట్‌గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్‌గార్డ్ కమాండెంట్ తెలిపినట్లు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని సిఎం ఆదేశించారు. మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని, అవసరమైన ప్రతి చర్యనూ సమన్వయంతో చేపట్టాలని స్పష్టం చేశారు. బోటు ఆచూకీ లభించే వరకు కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







కామెంట్‌లు (0)