ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

13న స్టీలు బ్రిడ్జిని ప్రారంభించనున్న సిఎం

10 ఆగస్టు, 2026

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అదేరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు ప్రభుత్వానికి అప్పగింత

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలో సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డుపై బకింగ్‌ ‌హామ్‌ ‌కెనాల్‌ వద్ద నిర్మించిన స్టీలు బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 13వ తేదీన ప్రారంభించనున్నారు. దీనికి వీలుగా సిఆర్‌‌డిఏ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. వంతెన వద్ద పైలాన్‌ ‌బ్యూటిఫికేషన్‌ ‌పనులను పూర్తి చేశారు. అక్కడ నుండి అదే రోడ్డుపై సిఎం రాయపూడిలోని సిఆర్‌‌డిఏ కార్యాలయం సమీపంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను సాధారణ పరిపాలనాశాఖకు అప్పగించనున్నారు. 60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన సీడ్‌‌యాక్సెస్‌(ఈ3) ‌రోడ్డును దొండపాడు నుండి తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్ప్రతి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డును మూడు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశలో దొండపాడు నుండి వెంకటపాలెం వరకూ నిర్మాణం 2019కు ముందే పూర్తి చేశారు. అక్కడ నుండి సీతానగరంలోని ఇరిగేషన్‌ ‌వర్కుషాపు వరకూ రెండోదశ, అక్కడ నుండి మణిపాల్‌ ‌వరకూ మూడోదశలో చేపట్టనున్నారు. వీటిల్లో మొదటి రెండుదశలూ దాదాపు పూర్తయ్యాయి. సీతానగరం నుండి మణిపాల్‌ ‌వరకూ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌రూపంలో వంతెన నిర్మాణం మిగిలి ఉంది. తొమ్మిది లైన్లు ఉండే ఈ రోడ్డులో మధ్యలో బిఆర్‌‌టిఎస్‌ ఏర్పాటు చేశారు. 13వ తేదీన దీన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రదబాబునాయుడు తొలిసారి అక్కడ నుండి అదే రోడ్డుపై ప్రయాణించి రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే వాటిని పూర్తి చేసిన నేపథ్యంలో సాధారణ పరిపాలనశాఖకు అప్పగించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించనున్నారు. రాజధాని నిర్మాణం తరువాత తొలిసారి పూర్తిచేసినవి కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతి రాజధాని పనుల్లో సిఆర్‌‌డిఏ కార్యాలయం మినహా ప్రభుత్వానికి సంబంధించి పూర్తి చేసిన తొలి నిర్మాణాలు ఇవే కావడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్