ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమట్టి..మనిషి.. ప్రకృతి.. వినాయక చవితి

1 గంట క్రితం

ChatGPT Image Sep 8, 2026, 04_12_25 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:21 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

మట్టిని మనుషులంతా ఐక్యంగా పత్రితో పూజించి, మళ్లీ ప్రకృతిలో కలిపే పండుగే వినాయకచవితి. చెరువు, నదుల్లోని మట్టిని తీసుకొచ్చి, వినాయకుడు విగ్రహాలు చేసుకొని, పొలాల్లో దొరికే రకరకాల మొక్కల పత్రి ఇంటికి తీసుకొచ్చి.. పందిరి వేస్తే పండుగ కళ వచ్చినట్లే. ఇంటి ముంగిట మామిడి తోరణాలు కట్టి, వీధిలో పిల్లలు, పెద్దలు, యువత అంతాకలిసి ఆ మట్టి వినాయకుడిని పూజిస్తారు. ఇలా చెట్టు నుంచి ఆకులు, పొలం నుంచి ధాన్యం, తోట నుంచి పూలు, నేల నుంచి మట్టి.. చుట్టూ ఉన్న ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పండుగ వినాయకచవితి. ప్రకృతిలో ఉన్నదాన్ని తీసుకోవడం... దాని విలువను గుర్తించడం... చివరికి తిరిగి ప్రకృతిలోనే కలపడం అనేది మన పూర్వీకుల సాంప్రదాయం. వారం రోజుల తర్వాత ఆ మట్టి వినాయకుడిని మళ్లీ నీటిలోనో, పొలంగట్టునో, ఏదొక చెట్ల పాదుల్లోనో కలపాలి. ఆ మట్టి పొలంలో చేరితే నేల సారవంతమవుతుందని, పంటకు మేలు జరుగుతుందని రైతులు నమ్ముతారు. ప్రకృతి నుంచి తీసుకున్నదాన్ని తిరిగి ప్రకృతికే అప్పగించే ఆ ఆలోచనలోనే పల్లె జీవన తత్వం కనిపిస్తుంది. వినాయకచవితి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.


ఈ ఏడాది పండుగను జరుపుకునేటప్పుడు... మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా గమనించుకోవాలి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతున్న వేళ ప్రతి చుక్క నీటికి విలువ పెరిగింది. ఆ నీటిపైనే రైతు ఆశ, పంట భవిష్యత్తు, మనిషి ఆహారం ఆధారపడి ఉన్నాయి. అందుకే పండుగ సందడిలో నీటిని వృథా చేయకుండా, చెరువులను కలుషితం చేయకుండా, మట్టితో చేసిన సహజ విగ్రహాలకు ప్రాధాన్యం ఇద్దాం. పత్రి, పూలు, మట్టి... ప్రకృతి ఇచ్చినవాటితోనే పండుగను అందంగా చేసుకుందాం. ప్లాస్టిక్, రసాయన రంగులు, నీటిని కలుషితం చేసే పదార్థాలకు దూరంగా ఉందాం.

ఇంటికో గంపెడు..

వినాయక చవితి పండుగ రోజున అందరూ మట్టి వినాయకుడినే పూజించాలి. ఆ మట్టి బంకమట్టి అయితేనే రూపం కూడా బాగా తయారవుతుంది. ఇలా మన స్థానిక పాంత్రాల్లో ఉన్న చెరువులు, నదీతీరాల్లో ఉన్న బంకమట్టినే తీసుకోవాలి. అలా మట్టి తీసుకోవడం కేవలం వినాయకుడి విగ్రహ రూపం చేయడమే కాదు.. చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, వాటి లోతును పెంచే ఒక ఉమ్మడి బాధ్యత కూడా. చెరువు లోతు పెరిగితే, వర్షాకాలంలో కురిసే నీటిని మరింత ఎక్కువగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ నీరే తర్వాత పొలాలకు, పశువులకు, గ్రామీణ జీవనానికి ఆధారమవుతుంది. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల అందరూ తలో చెయ్యివేసి చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది, చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది.

పత్రి ప్రాముఖ్యత

అలాగే వినాయకుడి పూజ కోసం వాడే పత్రి ఈ పండక్కు చాలా ప్రత్యేకం. వినాయక చవితి నాడే ఎందుకు పత్రితో పూజిస్తామంటే, ఇది వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. వాతావరణంలో మార్పుల వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో మన చుట్టూ ఉండే 21 రకాల మూలికా పత్రాలను(మాచీ పత్రి, బిల్వం, గరిక, ఉత్తరేణి, తులసి, మామిడాకు, రేగు, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు...) సేకరించడం ద్వారా ప్రజలకు ఆయా మొక్కల ప్రాముఖ్యత, వాటి ఔషధ గుణాలు తెలుస్తాయి. ఈ మట్టి వినాయకుడిని చవితిరోజున ప్రకృతిలో దొరికే 21 రకాల ఆకులతో పూజించడం అనేది మన సాంప్రదాయం, సంస్కృతిలో ప్రత్యేకమైనది. ఒక్కసారి ఆలోచిస్తే... ఒకే పండుగ పూజలో ఇన్ని రకాల చెట్లు, మొక్కలు, ఆకులు చోటు సంపాదించడం ఎంత గొప్ప ప్రకృతి పరిచయం!. పత్రి తీసుకురావడానికి ముందుండేది పిల్లలే. పుస్తకంలో మొక్కల పేర్లు చదవకుండా... ఆ పండుగ పేరుతోనే పిల్లలకు వాటిని పరిచయం చేసే ఒక పాత పద్ధతి ఇది. “ఇది ఏ ఆకు?” అని పిల్లలు అడగడం... “ఇది జమ్మి... ఇది మామిడి... ఇది ఉత్తరేణి...” అంటూ పెద్దలు చెప్పడం... అలా ఒక తరం నుంచి మరో తరానికి ప్రకృతి విశేషాలు పరిచయం అవుతాయి. పత్రి అంటే కేవలం ఆకుల కట్ట కాదు. మన ఊరి చెట్టు, మన పొలం గట్టు, మన ఇంటి పెరడు, మన చెరువు పరిసరాలు, ప్రకృతిని పూజించడం. అందుకే మన ప్రాంతంలో సహజంగా పెరిగే మొక్కలను గుర్తించి, వాటిని కాపాడటం కూడా ఈ సంప్రదాయానికి సరైన కొనసాగింపు.

vinayaka patri _001.jpg

ప్రతి ఒక్కటీ ఒక ఔషధం

1.మాచిపత్రి: ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే కళ్లుమంటలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన ఉంటుంది. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.

2.ముళ్లవంకాయ/వాకుడు ఆకు : దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది నీటిలో వేసి వేడిచేసి, ఆ నీళ్లు తాగితే కఫం, వాతం తగ్గుతుంది. జ్వరం తగ్గుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు.

3. మారేడు ఆకు: బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు తగ్గుతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగులు రావు.

4. గరికే/ గరికపూసలు: ఈ గరిక చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.

5. ఉమ్మెత్త ఆకు : దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.

6. బదరీపత్రం : (రేగు ఆకు) దీని పత్రాలు చర్మంపై కురుపులను త్వరగా నయం చేస్తాయి. ఈ పత్రాల రసం గొంతుశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

7. తులసీపత్రం : ఇందులో శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గు తగ్గిస్తాయి. నోటి దుర్వాసనను అరికడుతుంది. మధుమేహం, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.

8. ఉత్తరేణి ఆకు : ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.

9. మామిడి ఆకు : (మామిడి) లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి.

10. గన్నేరు ఆకు : (గన్నేరు) దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది.

11. విష్ణుక్రాంతి ఆకు : (హరిపత్రం)ఈ పత్రాల రసం, చూర్ణం జ్ఞాపకశక్తికి, నరాల బలహీనత సమస్యలకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది.

12. దానిమ్మ ఆకు :దానిమ్మ పత్రం) వీటి ఆకుల రసం వగరుగా ఉంటుంది. అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు.

13. దేవదారు ఆకు: దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

14. మరువం : (మరువము) దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి.

15. వావిలాకు : దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం , ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు.

16. జాజి ఆకు: ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. 17. సీతాఫలం ఆకు : దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం, విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.

18. జమ్మి ఆకు : దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.

19. రావి ఆకు : ఈ ఆకుల, చెక్కరసం కలిపి తీసుకుంటే విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.

20. మద్ది ఆకు : ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది.

21. జిల్లేడు ఆకు : ఆయుర్వేదంలో దీనిని 64 రోగాల నివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు. దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం వంటి వ్యాధులకు మందుగా వాడుతుంటారు. సీజన్‌‌లో వచ్చే జలుబూ తగ్గుతుంది. వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలో కలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.

ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి.

ఆరోగ్యంగా ఆహారం..

చవితిరోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను వండటం మన సంప్రదాయం. వర్షఋతువు కారణంగా అనారోగ్యానికి గురికాకుండా ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని పూర్వీకులు చెప్పారు. అందుకే ఉండ్రాళ్లు తప్పకుండా ఈ పండుగరోజు చేస్తారు.. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, జీర్ణసమస్యలను తొలగిస్తుంది. నువ్వులు, బెల్లంతో చలిమిడి తప్పకుండా చేస్తారు. నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగిస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను పండుగ రోజుల్లో.. రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని వండి, ఇరుగుపొరుగు వారితో పంచుకుంటారు.

vinayakudu7.jpg

ఒకే కుటుంబంలా..

పందిరి వేసిన రోజు నుంచి మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేవరకూ ఆ చుట్టుపక్కల వారంతా ఒకే కుటుంబంలా కలిసిపోతారు. అందరినీ భాగస్వాములను చేస్తారు. ‘‘నేను బియ్యం ఇస్తాను.. నువ్వు ఫలహారాలు చేయి..’’ అనుకుంటూ చిన్నా, పెద్దా, ధనికా, పేదా అనే తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరతారు. భోజనాలూ ఏర్పాటు చేస్తారు. అందులోనే అతిథులకు ప్రేమగా వడ్డించిన అన్నం. ‘ఇంకొంచెం పప్పు వేయనా?” అంటూ ఒకరు అడిగితే, యువకులు ప్లేట్లు ఇస్తే, పిల్లలంతా గ్లాసుల్లో మంచినీళ్లు ఇవ్వండి.. పందిరి దగ్గర పండుగ వాతావరణంలో ఆప్యాయత కనిపిస్తుంది. తినేవారి కళ్లలో ఆకలి తీరుతున్న సంతృప్తితో పాటు, ఒకే కుటుంబంలా ‘మనమంతా ఒక్కటే’ అనే భావన కనిపిస్తుంది.

డీజేలు లేకుండా...

వినాయక చవితి పూజలు పూర్తయ్యాక, భక్తులంతా ఎదురుచూసే చివరి ఘట్టం నిమజ్జనం. మట్టి వినాయకుడిని పందిరి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి, పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చి, నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ప్రాంతాన్ని బట్టి నిమజ్జనం చేసే రోజు మారుతూ ఉంటుంది. నిమజ్జనానికి ముందు గణపతికి చివరి పూజ నిర్వహించడం, నైవేద్యం సమర్పించడం సంప్రదాయంలో భాగం. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇలాగే వచ్చే సంవత్సరం కూడా పండుగ జరుపుకోవాలని గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. అందులో ఉత్సాహమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఊరేగింపులో డప్పులు, దరువులు, భజనలు, భక్తిగీతాలు సంప్రదాయబద్ధమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. పండుగ అంటే శబ్దం చేయడం, ఆర్భాటం చేయడం మాత్రమే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఆనందం ఎదుటివారికి ఇబ్బందిగా మారకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు, పక్కనే నివసించే ప్రజల ప్రశాంతతకు భంగం కలగకుండా నిమజ్జనం నిర్వహించడం సామాజిక బాధ్యత. అందుకే డీజేలు, అత్యధిక శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌లు లేకపోయినా పండుగలోని సంప్రదాయ సొగసు కనిపిస్తే సరిపోతుంది. మన ఆనందం ఇతరుల అసౌకర్యానికి కారణం కాకూడదు. నిమజ్జనం సందర్భంగా మరో ముఖ్యమైన బాధ్యత పర్యావరణ పరిరక్షణ. నీటి వనరులను కలుషితం చేయకుండా చూడాలి.

మట్టి మన మూలం. ప్రకృతి మన ఆధారం. మనమంతా వాటిని ఉపయోగించుకుంటూ జీవనం సాగించాలి. అదే ఈ వినాయకచవితి పండుగ ఇచ్చే సందేశం.

వీర
94905 59477

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్