ఓజోన్ పొర భూమికి సహజ రక్షణ కవచం. ఓజోన్‌ను కాపాడటంతో పాటు.. భూమిని వేడెక్కించని సుస్థిర శీతలీకరణ వైపు ప్రపంచం అడుగులు వేయాలి. మనకు ఎండ నుంచి గొడుగు రక్షణ కల్పించినట్టే.. భూమికి ఓజోన్ పొర సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే ఓజోన్ అంటే కేవలం వాతావరణంలో ఉన్న ఒక వాయువు పొర కాదు. మానవులు, జంతువులు, మొక్కలు, సముద్ర జీవవ్యవస్థలు సహా మొత్తం జీవరాశి మనుగడకు అవసరమైన సహజ రక్షణ వ్యవస్థ. ఓజోన్ పొర ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఏటేటా సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2026 ప్రపంచ ఓజోన్ దినోత్సవం థీమ్ “Global action for a cooler planet” “చల్లని భూమి కోసం ప్రపంచ చర్యలు”. ఓజోన్ పరిరక్షణలో ప్రపంచం సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో సుస్థిర శీతలీకరణ దిశగా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందేశం చాటి చెబుతోంది.
ప్రతి రోజూ సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడి కిరణాలు భూమిపై జీవానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అదే సమయంలో వాటిలోని కొన్ని అతినీలలోహిత (యువి) కిరణాలు జీవరాశికి హానికరం. ఈ హానికరమైన యువి కిరణాల్లోని గణనీయమైన భాగాన్ని గ్రహించి, భూమిపై జీవరాశిని రక్షించే సహజ కవచమే ఓజోన్ పొర. ఈ పొర మన కళ్లకు కనిపించదు. కానీ దాని రక్షణ లేకుండా భూమిపై జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ఎండ నుంచి మనల్ని గొడుగు కాపాడినట్టే.. స్ట్రాటోస్ఫియర్‌లోని ఓజోన్ పొర సూర్యుడి హానికరమైన యువి-బి, యువి-సి కిరణాల్లోని ఎక్కువ భాగాన్ని గ్రహించి జీవరాశిని రక్షిస్తుంది. అందుకే ఓజోన్ పొరను కేవలం వాతావరణంలోని ఒక పొరగా కాకుండా.. భూమి జీవరక్షణ కవచంగా చూడాలి.
పరిరక్షణ ఎందుకు కీలకమంటే?
ఓజోన్ పొర బలహీనపడితే భూమిపైకి చేరే హానికరమైన యువి-బి కిరణాల ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల చర్మ క్యాన్సర్, కంటిశుక్లం వంటి కంటి సమస్యలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని పంటలు, మొక్కలు, సముద్రంలోని సూక్ష్మజీవులపైనా అధిక యువి రేడియేషన్ ప్రతికూల ప్రభావం చూపొచ్చు. అంటే ఓజోన్ పరిరక్షణ అనేది కేవలం వాతావరణ శాస్త్రవేత్తల సమస్య కాదు. అది మన ఆరోగ్యం, ఆహార భద్రత, జీవవైవిధ్యం, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, భవిష్యత్తు పర్యావరణ భద్రతతో ముడిపడిన అంశం.

మానవ చర్యలతో వచ్చిన ముప్పు
మానవ అవసరాల కోసం తయారుచేసిన కొన్ని రసాయనాలు ఓజోన్ క్షీణత సమస్యను తీవ్రతరం చేశాయి. ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్లు (సిఎఫ్‌సిలు) గతంలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ ఉత్పత్తులు, ఫోమ్ తయారీ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. వాతావరణంలోకి చేరిన సిఎఫ్‌సిలు పై వాతావరణంలో యువి రేడియేషన్ ప్రభావానికి గురై క్లోరిన్ వంటి క్రియాశీల కణాలను విడుదల చేస్తాయి. అవి ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేయడంతో ఓజోన్ పొర క్రమంగా క్షీణించింది.
భూమికి ఒక హెచ్చరిక
అంటార్కిటికా పైన ఓజోన్ సాంద్రతలో తీవ్రమైన కాలానుగుణ క్షీణత కనిపించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. దీనినే సాధారణంగా ‘ఓజోన్ రంధ్రం’ అని పిలుస్తాం. ఇది ఆకాశంలో ఏర్పడిన నిజమైన రంధ్రం కాదు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఓజోన్ సాంద్రత తీవ్రంగా తగ్గిన పరిస్థితిని సూచించే పదం. ఇది ప్రకృతి ఇచ్చిన హెచ్చరిక మాత్రమే కాదు.. మానవ చర్యలు ప్రపంచ పర్యావరణ వ్యవస్థలపై ఎంతటి ప్రభావం చూపగలవో తెలియజేసిన గుణపాఠం కూడా.
మాంట్రియల్ ప్రోటోకాల్.. ప్రపంచానికి ఒక పాఠం
ఓజోన్ సంక్షోభానికి ప్రపంచ దేశాలు ఇచ్చిన సమాధానం చరిత్రలో ఒక గొప్ప పర్యావరణ విజయగాథగా నిలిచింది. 1987లో ఆమోదించిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్‌ను క్షీణింపజేసే పదార్థాల ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా తగ్గించేందుకు ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. శాస్త్రీయ ఆధారాలు, అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల భాగస్వామ్యం కలిసి పనిచేసినప్పుడు ఒక ప్రపంచ పర్యావరణ సమస్యను ఎదుర్కోవచ్చని మాంట్రియల్ ప్రోటోకాల్ నిరూపించింది. ప్రపంచ దేశాల సమిష్టి చర్యల ఫలితంగా ఓజోన్ పొర క్రమంగా పునరుద్ధరణ దిశగా పయనిస్తోంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఒక్కటే.. దేశాలు కలిస్తే.. పర్యావరణ సమస్యలకు పరిష్కారం సాధ్యమే.
వాతావరణ పరిరక్షణ
ఓజోన్ పరిరక్షణలో ప్రపంచం సాధించిన పురోగతి కొత్త సవాలును కూడా ముందుకు తెచ్చింది. సిఎఫ్‌సిలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన కొన్ని రసాయనాలు ఓజోన్‌కు తక్కువ హాని కలిగించినప్పటికీ, వాటిలో కొన్ని శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువులుగా మారాయి. ఇక్కడే ఓజోన్ పరిరక్షణకు, వాతావరణ మార్పుకు మధ్య ఉన్న సంబంధం మరింత స్పష్టమవుతుంది. మనకు రిఫ్రిజిరేటర్లు కావాలి. ఎయిర్ కండిషనర్లు కావాలి. ఆహారం, మందుల నిల్వకు కోల్డ్‌చైన్ వ్యవస్థలు కావాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శీతలీకరణ అవసరం మరింత పెరుగుతోంది. కానీ మనల్ని చల్లబరచే సాంకేతికతే భూమిని మరింత వేడెక్కించేలా ఉంటే సమస్య మరింత క్లిష్టమవుతుంది. అందుకే చల్లదనం కావాలి.. కానీ ఆ చల్లదనం భూమిని మరింత వేడెక్కించేలా ఉండకూడదు. వాతావరణ మార్పు ప్రభావాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొత్త పర్యావరణ ప్రమాదాలనూ సృష్టిస్తున్నాయి. ఆగస్టు 26న నేపాల్‌లోని రాసువా ప్రాంతంలో హిమ-శిలా విరిగిపడటం, దాని అనంతర పరిణామాలతో భోటెకోషి–త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. ఈ ఘటనకు వాతావరణ మార్పుతో ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇది ఓజోన్ పొర క్షీణతకు ప్రత్యక్ష ఫలితం కాదు. అయితే వేడెక్కుతున్న ప్రపంచంలో హిమాలయ ప్రాంతాలు ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదాలను గుర్తుచేసే సమకాలీన ఉదాహరణగా దీనిని చూడొచ్చు.

దేశానికి ముఖ్యమైన సవాలు
భారతదేశం వంటి ఉష్ణమండల దేశంలో శీతలీకరణ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పట్టణీకరణ, జీవన ప్రమాణాల్లో మార్పులు, ఆరోగ్య రంగం, ఆహార నిల్వలు, కోల్డ్‌చైన్ అవసరాలు, ఇవన్నీ శీతలీకరణకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అందువల్ల మన ముందున్న సవాలు ద్వంద్వమైనది. ప్రజలకు అందుబాటులో ఉండే శీతలీకరణ కావాలి. అదే సమయంలో పర్యావరణానికి తక్కువ హాని చేసే శీతలీకరణ వ్యవస్థలు కావాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. తయారీదారులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, వినియోగదారులు అందరూ ఇందులో భాగస్వాములు కావాలి.
చల్లని భూమి కోసం ప్రపంచ చర్యలు
ఈ సంవత్సరం (2026) ఓజోన్ దినోత్సవ సందేశం కేవలం “ఓజోన్‌ను కాపాడండి” అన్న దానితో ఆగిపోవడం లేదు. ప్రపంచాన్ని చల్లగా ఉంచడానికి మనం ఉపయోగించే శీతలీకరణ వ్యవస్థలు కూడా సుస్థిరంగా ఉండాలనే విస్తృత సందేశాన్ని ముందుకు తెస్తోంది. 2016లో రువాండాలోని కిగాలీలో ఆమోదించిన కిగాలి సవరణ మాంట్రియల్ ప్రోటోకాల్ పరిధిలో హెచ్‌ఎఫ్‌సిల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌ఎఫ్‌సిలు ఓజోన్ పొరను నాశనం చేయవు. అయితే అవి శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువులు. అందువల్ల వాటి వినియోగాన్ని తగ్గించడం వాతావరణ మార్పును నియంత్రించడంలో ముఖ్యమైన చర్య. కేవలం శీతలీకరణలో ఉపయోగించే రిఫ్రిజెరెంట్‌ను మార్చడం సరిపోదు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ సామర్థ్యాన్ని అందించే శక్తి, సమర్థ శీతలీకరణ సాంకేతికతల వైపు కూడా మారాలి. ఎందుకంటే శీతలీకరణ రంగంలో విద్యుత్ వినియోగం కూడా పరోక్షంగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుంది.

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడమే ధ్యేయం
శీతలీకరణ రంగంలో ఈ మార్పులు హిమాలయాల వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరిరక్షణతో కూడా ముడిపడి ఉన్నాయి. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమాలయ గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయి. గ్లేసియర్ల కరుగుదలతో హిమ సరస్సులు విస్తరించడం, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల ముప్పు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి శీతలీకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటూ దాని వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను తగ్గించడం నేటి ప్రధాన సవాలు. ఇంధన సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, హీట్ పంపులు వంటి సాంకేతికతలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి. అదే సమయంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా శీతలీకరణకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి నుంచి వచ్చే ఉద్గారాలను కూడా తగ్గించాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న శీతలీకరణ అవసరాలను పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే విధంగా తీర్చే విధానాలు అవసరం. ఓజోన్ పరిరక్షణలో ప్రపంచ దేశాలు సాధించిన విజయాన్ని వాతావరణ మార్పుల నియంత్రణలోనూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఓజోన్ పొరను కాపాడటం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, శక్తి సామర్థ్యాన్ని పెంచడం పరస్పరం అనుసంధానమైన చర్యలుగా చూడాలి. అప్పుడే శీతలీకరణ అవసరాలు తీరడంతో పాటూ భూమిని వేడెక్కిస్తున్న వాతావరణ సంక్షోభాన్ని కూడా అదుపులోకి తీసుకురాగలం.
ఓజోన్‌ను కాపాడుదాం...
భవిష్యత్తును చల్లగా ఉంచుదాం...!
చల్లని భూమి కోసం ప్రపంచ చర్యల్లో
మనమూ భాగస్వాములమవుదాం..!!

డాక్టర్ పల్లె సూర్యనాగిరెడ్డి
భౌతికశాస్త్ర అధ్యాపకులు
ప్రభుత్వ కళాశాల (అటానమస్),
అనంతపురం. 9491155894








కామెంట్‌లు (0)