గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దళిత సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలం

2 గంటల క్రితం

karnool
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 02:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఈ నెల 16 నుంచి ఆగస్టు 24 వరకు ‘దళితవాడల బాట’

రాష్ట్రంలో రైతులను కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోంది

ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి

నంద్యాల నరసింహయ్య భవన్‌లో దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం ప్రజాసంఘాల వర్క్‌షాప్

ప్రజాశక్తి - నంద్యాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళితవాడల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ప్రజాసంఘాల నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నరసింహయ్య భవన్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం 'దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం` వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. ఏసు రత్నం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా నేటికీ దళితుల సమస్యల పరిష్కారంలో పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. దళితులు చనిపోతే అంత్యక్రియలు జరుపుకోవడానికి కనీసం స్మశాన వాటికలు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. దళితుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వం, వారి సామాజిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. దళితుల స్మశాన వాటికల కోసం గతంలో వచ్చిన జీవోలను సైతం ఈ ప్రభుత్వం మరుగున పడేస్తోందని ఆరోపించారు. మతం పేరుతో మైనార్టీలపై దాడులు జరుగుతుంటే కమ్యూనిస్టులు తప్ప మరే ఇతర పార్టీలు మాట్లాడటం లేదని గుర్తుచేశారు. దళితవాడల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ‘సామాజిక శంఖారావం’ పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, సిఐటియు , డివైఎఫ్ఐ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఆగస్టు 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘దళితవాడల బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళిత వర్గాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయని, వారి హక్కులను కాపాడటంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. పాలకులపై ఒత్తిడి తెచ్చేలా దళితుల సమస్యలను రాజకీయ అజెండాగా మార్చేందుకు పోరాటాలు సాగించాలన్నారు.

రైతులను కూలీలుగా మార్చే కుట్ర:

రాష్ట్రంలో ‘మీ భూమి - మీ హక్కు’ పేరుతో రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటూ, వారిని కూలీలుగా మార్చే పెద్ద కుట్ర జరుగుతోందని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి స్వయంగా ముఖ్యమంత్రి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. రాష్ట్రానికి రూ. 11 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేస్తూ తక్షణమే ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు.

'సర్‌ ’ (ఎస్ఐఆర్) విధానాన్ని వ్యతిరేకించాలి:

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 'సర్‌’ (ఎస్ఐఆర్ ) విధానం పేరుతో ఓటర్ల సంఖ్యను తగ్గించి, ఉన్న ఓట్లను కొనుగోలు చేస్తూ శాశ్వతంగా అధికారంలో ఉండాలని చూస్తోందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనికి రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నారని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

దళితవాడల్లో వివక్షపై పోరాటాలు ఉధృతం చేస్తాం: డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న

డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంటరానితనం, కుల వివక్ష ఇంకా వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయని, వాటిని రూపుమాపడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, బిజెపిలు దేశంలో కుల వివక్షకు ఆజ్యం పోస్తుంటే, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ ఆదేశాలను పూర్తిగా మోస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో దళితులను రానివ్వకుండా అగ్రకులాలు తొక్కివేస్తున్నాయని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు, కుల నిర్మూలనకు సమాజం యావత్తు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎస్ సి సబ్‌ప్లాన్ నిధులను దళితవాడల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కే చర్యలు ఎక్కువయ్యాయని, అందులో భాగంగానే ప్రజా సంక్షేమం కోసం ప్రశ్నిస్తున్న రావణ్‌ వంటి నాయకులపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. నాగేశ్వరరావు, నరసింహ నాయక్, కెవిపిఎస్ జిల్లా నాయకులు పుల్లా నరసింహ, జిల్లా కార్యదర్శి కె. రంగమ్మ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్